About Me

My photo
Published two books viz., Relapoolu, Amma Kathalu. అమ్మ కథలు, రేలపూలు

Friday, June 29, 2018

రెడపంగి కావేరి


 గతుకుల మట్టి రోడ్డుపయి నెమ్మదిగా ముందుకు సాగుతున్నది అర్చన శ్రీరాం దంపతుల బండి. మెలికలు మెలికలుగా మలుపులు తిరుగుతూ యెంత దూరం సాగినా వాళ్ళు చేరాల్సిన ఆ పల్లె రాలేదు. అందరు ఉద్యోగులలాగే బడి పంతుల ఉద్యోగుల జీవితాల్లో బదిలీలు చాలా సాధారణం. కానీ కొత్త బడిలో చేరుతున్న ప్రతిసారీ కొత్తగా బడిలో చేరుతున్న చిన్నపిల్లల్లె మనసు బెరుకుగా ఉంటుంది అర్చనకు. అందుకే తొలి రోజు కాబట్టి ఆమె భర్త శ్రీ రామ్ కూడా తోడూ వచ్చాడు.
     "మీ బడి టీచర్ల కోసమే వెలిసాయా ఈ తండాలు ఇంత మారుమూల." రోజూ తన భార్య ఇంత  దూరం రావలసి ఉంటుందే అని బాధ పడ్డాడు అర్చన భర్త. "అలా అనుకుంటే ఎలా అండి మొదటి రోజు కదా చాల దూరం అనిపిస్తుంది. నాలుగు రోజులు అలవాటయ్యాక ఇంత  దూరం అనిపించదు." అని అన్నది. మరో రెండు పల్లెలు దాటాక  ఒక తండా వచ్చింది.. ఊరి మొదట్లో చిన్నగడ్డి మోపు పట్టుకుని నడచి వెళ్తున్నది ఓ  పన్నెండేళ్ళ  అమ్మాయి.
 "  గణేష్ తండా ఇదేనా పాపా ! ?" అని అడిగారు ఆర్చన  దంపతులు .    
 "నువ్వు కొత్త గొచ్చిన టీచర్వా .." ఆ అమ్మాయి అది గణేష్ తండానో కాదో చెప్పకుండా ఉత్సహంగా అడిగింది .. 
"అవును ." అన్నది .. అర్చన
"ఇదే గణేష్ తండా."కళ్ళు  చక్రాల్ల తిప్పుతూ అన్నది.
 "ఆరో తరగతికి కూడా వస్తవా టీచర్..? నువ్వు ఇంగ్లీష్ చెప్తావే .." వెంట వెంటనే  అని అడిగింది ..
"చెప్తాను కాని ముందు బడి ఎక్కడుందో చెప్పు .." 
"ఇంకా కొంచెం ముందుకు బోతే బోరింగ్ కాడ ఒక గేటు కనవడ్తది అదే బడి .."
" ఇంతకీ నీ పేరేమిటమ్మా .?"
"రెడపంగి కావేరి.."మెరుస్తున్న కళ్ళతో ఒకింత దర్పంగా ఇంటి పేరుతో సహా తన పేరు చెప్పింది. అంతలోనే కాస్త బెరుకుగా 
"టీచర్ నేను ఆరోది చదువుతున్నా.. మా అమ్మమ్మకి జరం. ఆవుదూడకు గడ్డి కోసం పోయిన రేపటి నుండి బడికొస్తా.. టీచర్"  అన్నది.
" సరేలే .." నవ్వుకుంటూ ముందుకు సాగిపోయారు శ్రీ రామ్ దంపతులు. "కొత్త టీచరొచ్చింది.. కొత్త టీచరొచ్చింది.." అరచుకుంటూ ఊర్లోకి సాగిపోయింది కావేరి
     చాల వెనుక బడిన ప్రాంతం అది. అరకొరా సౌకార్యలతో పాత బడిన గోడలతో ఉన్న బడి అది. జాయినింగ్ రిపోర్ట్ రాసిచ్చి ఆ బడిలో తొలి సంతకం చేసింది. "మొత్తం ఎనిమిది మంది సార్లు నేను ఒక్కతినే ఇక్కడ పంతులమ్మను హమ్మయ్య నాకు తోడుగా మీరు వచ్చారు.  చాల సంతోషంగా ఉంది అన్నది శారదా టీచర్"  ఇతర టీచర్లతోనూ పరిచయలయ్యాయి. ఆఫీస్ బయటకు వచ్చి కొత్త టీచర్ వచ్చిందని గుంపుగా తనని చుట్టుముట్టిన బడి పిల్లను చూస్తూ వారితో మాటల్లో పడింది. ఇక్కడ తానూ చేయవలసినది ఎంతో ఉన్నది అనుకున్నది. సాయంత్రం వరకూ ఉండి బెల్ అయ్యాక భర్తతో తిరుగు ప్రయాణమయ్యింది. 
    దారిలో "టీచర్.." అన్న పిలుపు వినపడి వెనక్కు చూసింది. ఇందాకటి కావేరి.. చేతులు వెనక్కు పెట్టుకుని బండికి అడ్డంగా నిలబడింది. అప్రయత్నంగా అర్చన బండి దిగింది. చేయి సాచి కావేరి ఓ కలువ పూవును అందించింది. అప్పుడు గమనించింది. కావేరి బట్టలు తడచి ఉండడాన్ని. అపురూపంగా ఆ కలువ పువ్వును అందుకుని.. "పిచ్చి పిల్ల నాకోసం చెరువులో దిగావా బాగా తడిచిపోయావు. త్వరగా ఇంటికెళ్ళి బట్టలు మార్చుకో" అంటూ.. కావేరి తల నిమిరి "రేపు తప్పకుండా బడికి రా.."  అని చెప్పి బండి ఎక్కింది. చల్లగాలి రివ్వున తాకుతుంటే ఆ అమ్మాయికి టా టా చెపుతూ ముందుకు సాగిపోయింది అర్చన.. వెనుకనుండి "టీచర్ నువ్వు అచ్చం మా అమ్మలా ఉన్నావు.." అన్న మాటలు చెవులకే కాదు మనసుకు తాకాయి.   
                                                   *  *  * 
  అనుకోకుండా అర్చనను ఆరోతరగతికి క్లాసు టీచర్ గా వేసారు. కావేరి బాగా చదివే అమ్మాయెమీ  కాదు కాని కాస్త అమాయకత్వం, ఒకింత గడుసుదనం. చురుకయిన కళ్ళు. ఎక్కడా ఆగకుండా తువ్వాయిలా పరుగు పెట్టె ఆ పిల్ల తుళ్ళింతలు.. అర్చనతో ఏదో అనుభంధం ఉన్నట్లుగా ఆ పిల్ల కనపరిచే ఆప్యాయత.. వీటన్నింటిని మించి ఆ పిల్లలో ఏదో తెలియని ప్రత్యేకత.. మరేదో ఆకర్షణ ఉన్నది. అదేమిటో అర్థం కావడం లేదు. కావేరితో మాట్లాడడం గురించి ఆలోచించడం నిత్య కృత్యాలయిపోయాయి ఆమెకు. కావేరిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ఇది మిద్దంగా ఇదీ అని చెప్పలేదు గాని ఆ ప్రత్యేకతకు అర్చన కట్టుబడి పోయింది. తనకు తెలియకుండానే కావేరి పట్ల అపేక్ష పెరిగి పోయింది. ఎలాగైనా ఆ పిల్లను దారిలో పెట్టి బాగా చదివించాలని అర్చన తాపత్రయపడసాగింది. కాని కావేరి తరుచూ బడి మానేస్తుంటుంది. దానికి ఏవేవో కారణాలు చెబుతుంటుంది.  
      రోజూ ఖమ్మం నుండి ఆ బడి ఉన్న తండాకు చేరుకోవడానికి అర్చన నాలుగు వాహనాలు మారి రావాల్సి వస్తున్నది. అదృష్టవశాత్తు సాయంత్రం మాత్రం డైరెక్ట్ బస్ ఉన్నది. అదీ బడి దగ్గరకే వస్తుంది. సాయంత్రం బడి ముగిసి పిల్లంతా బడి ఆవరణలోనే ఆడుకుంటూ ఉంటారు.  కొందరు బస్ వచ్చేవరకు అర్చన, శారదల చుట్టూ చేరి ముచ్చట్లు పెడుతుంటారు. ఎప్పటి లగే బడి వదిలాక పిల్లలంతా ఇళ్లకు వెళ్లిపోయారు. అర్చన శారదా బస్ కోసం ఎదురుచూస్తుండగా చుట్టూ చేరి పిల్లలు కబుర్లు చెప్పసాగారు. కావేరి ఆర్చన చెంత చేరింది.  
"నేను రోజూ బడికి రానని నీకు నామీద కోపమేం.." అడిగింది కావేరి  
"రాదా మరి రోజు బడికి రాకుంటే చదువెలా వస్తుంది మరి.."
"నిజమే టీచర్ మా అమ్మమ్మ లేవట్లేదు నేను పనికిబోకుంటే పయిసలేట్ల వస్తాయి. ? నాకంటే బడిల అన్నంబెడ్తరు. మా అమ్మకి అన్నమెవ్వెరు పెడతారు. మందులేవ్వరు ఇస్తరు.. " తన బాధను నొక్కి పెడుతూ కాస్త  గడుసుదనం మేళవించి చెబుతున్నది.
"అదేమిటి ఆమెకి పిల్లలు లేరా .."
"మా అమ్మమ్మకు మా అమ్మా, మా భీమారావు మామయ్యే పిల్లలు. మా నర్సయ్య మామయ్య కూడా ఉండేటోడు మూడేల్లకింద యాక్సిడెంటయి చచ్చిపోయిండు. ఇగ మా భీమ్రావ్ మామయ్య ఇక్కడుండడు హైదరాబాద్ లో ఉంటాడు. అయ్యో నీకు తెలవదు గదూ..  మా అమ్మ ఈడ ఉండదు. మా అమ్మ మళ్ళీ పెళ్లి చేసుకున్నది కదా ఆమెకి ఇద్దరు పిల్లలు బోనగిరిలో ఉంటది.." కావేరి చాలా మాములుగా చెబుతున్నది. అర్చన మాత్రం ఒక్కసారిగా  ఉలిక్కిపడింది.         
    "మా ఇంకో నాన్న .. అదే అశోక్ నాన్న మంచోడే గాని మాటి మాటికి పంపడానికి  చాన దూరమాయె. పాపం వాళ్ళకు కూడా ఎల్లాలే కదా. అదీగాక చెల్లె చాలా చిన్నది. మా తమ్ముడు ఇంకా చిన్నోడు. అందుకే వాళ్ళు రావడం కష్టం. ఇగ మా రమేష్ నాన్నను అదే మా అస్సలు నాన్నను పయిసలు అడుగుతుంటా. ఒక్కోసారి బాగానే ఇస్తాడు. ఒక్కోసారి మా అమ్మమ్మ మీద మస్తు కొట్లాడి వెళ్తాడు. బాగ తాగుతాడు. అందరి మీద గొడవలు పెట్టుకుంటాడు. మూడు నాలుగు సార్లు జైలుకు కూడా ఎల్లిండు కూడా. అసలు ఆయనను చూస్తుంటేనే  భయమేస్తుంటుంది. అయన మంచిగుంటే మాకీ కష్టాలు ఎందుకుంటాయి..?  మా అమ్మ యెంత మంచిదో..! నీ తీరే ఉంటది టీచర్.. అంటే నీ అంత తెల్లగా కాదనుకో..  కానీ మా అమ్మ చాల అందంగా ఉంటది." అమ్మ గురించి చెబుతుంటే కావేరి కన్నుల్లో వింత మెరుపు.
 "ఎప్పుడు నా కోసమే మనాది పెట్టుకుంటది. అప్పుడప్పుడు వచ్చి వారం రోజులు ఉంటది.   వచ్చేటప్పుడు నాకోసం కొత్త బట్టలు, రిబ్బన్లు, గాజులు తెస్తది. మా తమ్ముడికి రాఖీ కడతా గదా. పైసలన్న ఇస్తది. లేకుంటే బట్టలన్న తెస్తది.."  కావేరి ఒక రకం యాసతో అన్ని కబుర్లు  చెబుతుంటే విస్తుబోయి వింటున్నది అర్చన. 
   ఆ చిన్నారి జీవితంలో చక చక మార్పులు జరిగిపోయి..  అమ్మ చుట్టం చూపుగా వస్తున్నది. అమ్మా నాన్న బ్రతికి ఉండి చెరో చోటా బ్రతుకుతుంటే.. అమ్మమ్మకు తోడయి బ్రతుకుతున్నది. ఇన్ని మార్పులను బాధ్యతలను చిన్ని గుండె ఎలా తట్టుకుంటున్నదో కదా అనిపించింది. 
      "మరి మా అమ్మమ్మ పెద్దది. మా మామయ్యలు రమ్మన్నా పోకుండా నా కోసం ఈడనే ఉంటున్నది. అమెకేమయిన అయితే నేనే కదా చూసుకోవాలి." ఆరిందాలా అన్నది కావేరి. గుండె బరువయిపోగా అర్చనకేమి మాట్లాడాలో తోచలేదు. అంతలో "బస్సొస్తున్నది టీచర్  .బస్సొస్తున్నది టీచర్.." పిల్లల అరుపులు వినబడి తెరుకున్నది.         
కావేరి ఇదిగి ఈ వందా తీసుకుని మీ అమ్మమ్మకి మందులు కొను. నువ్వు మాత్రం.. రేపు బడికి రావాలి సుమా !" అని చెప్పి బస్ ఎక్కిందే గాని దారంతా కావేరి గురించే ఆలోచన. ఏది చెబుతున్నా ఆ కళ్ళలో మెరుపు .. దాచుకుంటున్న ఓ చిరునవ్వు మిళితమవుతుంటాయి. ఈ పిల్ల దగ్గర ఏదో తెలియని శక్తి ఉంది. మళ్ళీ అనుకున్నది.      
                                    *  *  * 
  బడి పిల్లలు చదువులో కాస్త బాగానే ఉన్నారు. అర్చన వచ్చిన దగ్గర నుండి వాళ్ళ వ్యక్తిగత శుభ్రత మీద దృష్టి పెట్టింది. రోజూ శుభ్రంగా తల దువ్వుకుని రావడం, గోళ్ళు తీసుకోవడం ఆడపిల్లలు రిబ్బన్లు వేసుకు రావడం. అందరూ తరగతి గదులు, కాంపౌండ్ శుభ్ర పరచడం లాంటి విషయాల మీద  శ్రద్ధ పెట్టింది. వాళ్ళల్లో చాలా మంది  పిల్లలు చాలా పేద పిల్లలు అవ్వడంవల్ల బంధు మిత్రుల దగ్గరనుండి పాత దుస్తులు సేకరించి తెచ్చి అవసరమున్న వాళ్ళకు  పంచింది. సూది దారాలు ఇచ్చి అందరికీ గుండీలు కుట్టడం నెర్పింది. పెద్ద పిల్లలు చిన్న  పిల్లలకు సహాయపడేలా చేసింది. వచ్చిన  కొద్ది కాలంలోనే పిల్లలకు బాగా చేరిక అయిపొయింది. ఇక  కావేరికి రెండు జతల కొత్త బట్టలు స్కూల్ బ్యాగ్ కొనిపెట్టింది. అందరూ "ఎంటండి మీరు ఆ పిల్లను అంతలా చేర దీస్తున్నారు ఆ పిల్ల వట్టి గాలి తిరుగుళ్ళు తిరుగుతున్తుందండి, చదువూ లేదు చట్టుబండలు లేదు. చేలు పట్టుకు తిరుగుతుంది" అన్నారు. అర్చన పట్టించుకోలేదు.                                          *  *  * 
           ఆ రోజు బడికి చాలా ఆలస్యమయిపోయింది అని కంగారు పడుతూ హడావుడిగా ప్రార్థన సమయానికి బడిలోకి అడుగు పెట్టింది అర్చన 
        బారులు తీరిన పిల్లలతో రాయంచలు కొలువయిన కొలనులా ఉన్నది  ఆ ప్రాంగణం. పిల్లలంతా కలసి పాడుకునే ఉదయరాగం.. వందేమాతర గీతం ఎంతో ఆహ్లాదంగా వినపడుతున్నది. ఒక అమ్మాయి ముఖంమీద జుట్టు పడుతుంటే మధ్యలో ఉఫ్ న  ఊది పాడుతున్నది. సోనికి అప్పుడే చెంప దురద పెట్టి గోకుతూనే రాగం అందుకున్నది. రాజుకి చేతిలో సగం తిన్న లాలీ పాప్ గబుక్కున బుగ్గలో దాచుకుని పాడుతున్నాడు. ఒకడు ఆకాశంవంక చూసి పాడుతుంటే, ఒకడు పక్కవాడి లాగు గుండీలు ఊడి పోయిన సంగతి గమనించి నవ్వు దాచుకుంటూ పాడుతున్నాడు.  దేశభక్తంతా చిన్నా ముఖంలోనే ఉన్నదా అన్నట్లు చాలా దీక్షగా పాడుతున్నాడు. సుజలాం అనగానే నాలిక పయికి నిలిపేసి .. సుఫలాం అనగానే నోరు మూసేసి.. మలయజ శీతలాం అనగానే నోరంతా తెరుచుకుని ముఖాల్లో రకరకాల హావ భావాలు వ్యక్త పరుస్తూ పాడుతున్న ఆ  చిన్నారుల ప్రార్థన సమవేశం చూసి తీరాల్సిందే. ఇక వాళ్ళు నిలుచున్నా తీరు చూడాలి. ఆ కాస్సేపు స్థిమితంగా నిలుచోలేక ఊగుతూ పాడేవారోకరు..  తల గోకుతూ పక్క వాడి ముఖంలోకి చిలిపిగా చూస్తూ ఒకరు..  టీచర్ల వంక భయంగా చూస్తూ ఒకరు.. ఏదో ఆలోచిస్తూ ఒకరు..  పదాలను మింగేస్తూ, విరిచేస్తూ, సాగదీస్తూ..  ఎంత అమాయికంగా పాడుతుంటారో..! అదొక అందమయిన ప్రపంచం. ఇక ప్రతిజ్ఞ కోసం చేయి సాచి నిలబడి భారతదేశం నా మాతృభూమి అని చెబుతూ బలం సరిపోక మరో చేయి ఆసరా తీసుకునే వాడు ఒకడు.  చాచిన చేయితో ఎదుటివాడి బుజం పయి ఒక్క సారి గుచ్చేవాడు ఒకడు. గట్టిగా అరిచి  చెప్పేవాడు ఒకడు .. నీరసంగా తప్పదన్నట్లు పెదాలు కదిపే వాడు ఒకడు. ఊడిన  రిబ్బన్ కుచ్చు ముఖం  మీదకు జారుతుంటే సరి చేసుకుంటూ ఒకమ్మాయి.. తానూ తెచ్చుకున్న పుట్టినరోజు చాక్లెట్లు ఎప్పుడు పంచాలా అని తపన పడుతూ ఒకమ్మాయి..  జలుబు ముక్కును తుడుచుకుంటూ ఒకమ్మాయి.. రాత్రి పెట్టుకున్న గోరింటాకు చేయిని చూసుకుంటూ ఒకమ్మాయి.. ఇలా  ప్రార్థన అలా ముగుస్తుందో లేదో.. వరి చేను నుండి ఒక్కసారిగా పయికి ఎగిరిన కొంగల బారులా.. అలలు అలలుగా ..  తరగతి గదులకు వెళ్తుంటారు. ప్రతి రోజు తానూ అమితంగా ఇష్టపడే దృశ్య కావ్యం ముగియగానే అర్చన ఆరవ తరగతి వరుసలో కావేరి లేకపోవడం అర్చన గమనించింది. కాస్త ఆలస్యంగానయినా వస్తుందేమో అని అనుకున్నది సంతకం చేసి హాజరు రిజిస్టర్ తీసుకుని తరగతి లోకి అడుగు పెట్టింది. 
      రిజిస్టర్ పట్టుకుని తరగతిలోకి వెళ్ళగానే పిల్లంతా లేచి గూ.. డ్.. మా.. నింగ్ మే.. డం అంటూ రాగ యుక్తంగా చెప్పారు. తానూ గుడ్మానింగ్ చెప్పింది. ఆ వెంటనే గలగలా మాట్లాడసాగారు. "లక్ష్మా గిచ్చిండు టీచర్.." " సరిత రిబ్బన్లు ఏసుకురాలే టీచర్ "  "రేవతికి ఇవ్వాళా జరం వచ్చింది టీచర్." " మీనాక్షి పద్యం నేర్చుకోలేదు.." " హారిక నన్ను కొట్టింది టీచర్.." " సలీం ఇందాక పడ్డాడు టీచర్.."  ఇలా వాళ్ళ మాటలన్నీవింటూ వాళ్ల  ఆరోపణలకు విని సమాధనమిస్తూ  హాజరు తీసుకోవడం మొదలు పెట్టింది ..
 "బానోతు హరీష్.. " ఎస్ టీచర్.."
" ఇస్లావాత్ లక్ష్మా.." ఎస్ టీచర్.."
"లేళ్ళ నవీన్..""రాలేదు టీచర్ వాడికి జ్వరం వచ్చింది .."
"భూక్య రమేష్ ఎస్  టీచర్ .." ఇలా అబ్బయిల హాజర్ అయ్యింది ..
 "బానోతు మీనాక్షి.." ఎస్ టీచర్.."
 "పండగ సరిత .."  ఎస్ టీచర్.."
"పాముల సావిత్రి "  ఎస్ టీచర్.."
"జక్కుల హారిక.." ఎస్ టీచర్.."
"రెడపంగి కావేరి.. "
"రాలేదు  టీచర్ .. " "ఎందుకు రాలేదు రోజు చెబుతున్నా ఆ అమ్మాయికి భయం లేకుండా పోతున్నది .. కోపంగా అన్నది అర్చన 
"అది కాదు టీచర్ వాళ్ళ అమ్మా వాళ్ళ ఇంకో నాన్న వచ్చిండ్రు టీచర్ .." అందుకే రాలేదు..
"ఓహో కావేరి వాళ్ళ అమ్మ వచ్చిందన్న మాట ఎందుకో మనసుకు కాస్త సంతోషం కలిగింది. ఆ కుంకుండు గింజల కళ్ళలో ఎన్ని మెరుపులు మెరసి ఉంటాయో .." కావేరి మీద కోపం ఎగిరిపోయింది .. 
"టీచర్ వాళ్ళ అమ్మ మళ్ళీ పెళ్లి చేసుకున్నది కదా..! కావేరి వాళ్ళ అమ్మమ్మ దగ్గరే ఉంటుంది. కావేరి వాళ్ళ అమ్మ వాళ్ళింకో నాన్న బోనగిరి లో ఉంటారు.." మళ్ళీ చెప్పడం  మొదలు పెట్టాడు లక్ష్మా
  "టీచర్ కావేరి వాళ్ళ అమ్మమ్మకి వంట్లో బాగోలేదు అందుకే చూడనీకి వచ్చిండ్రు." పిల్లలు చెప్పడం మొదలు పెట్టారు. పల్లెలో ఈ విషయనికయినా దాపరికం అంటూ ఉండదు. అందరి విషయాలు అందరికీ తెలిసి పోతుంటాయి. వాటిని చాల మామాలుగా మాట్లాడుకుంటారు. అయితే చిన్న చిన్న పిల్లలు కూడా చాల పెద్ద విషయాలు కూడా అతి మాములుగా చెబుతుంటే మొదట్లో విస్తుబోయివినేది అర్చన. ఇప్పుడిప్పుడే వాళ్ళ మాటలకు అలవాటు పడుతూ ఏది మాట్లాడవచ్చో ఎలా మాట్లాడకూడదో చెబుతూంటుంది. అందరీని నిశ్శబ్దంగా కూర్చోబెట్టి  పాఠం మొదలు పెట్టింది. 
        లంచ్ అవర్లో .. కిటికీ లోనుండి ఎవరో తొంగి చూస్తున్నట్లు అనిపిస్తే చూసింది. అవే రెండు మెరుస్తున్న చేప పిల్లలు. చిరునవ్వుతున్న పెదాలు. సంతోషంతో చిన్నగా లయగా ఊగిపోతూ కావేరి ..బయటకు వెళ్ళింది అర్చన.
 "నా మీద కోపమొచ్చిందా టీచర్ .. మా అమ్మొచ్చింది.. రెండు రోజులయినంక బడికి  తప్పక వస్తా .."
"నా కోపంతో నీకేమి పని. కనీసం పాఠాలన్నీ పోతున్నాయి అన్న భయం లేదు నీకు. లెక్కలు వినకుంటే పరీక్షలో ఎమిరాస్తావు.." కోపం నటిస్తూ అన్నది అర్చన. ఎందుకో కావేరిని చూస్తె కోపం రాదమెకు. "చదువుతా  టీచర్. తప్పకుండా చదువుతా " "టీచర్ ఇప్పుడు .. నాకు సంక్రాంతి సెలవలనుకో టీచర్. అప్పుడు నేను రాకుంటే కోపం రాదుగా ..! అట్లనే అనుకో  టీచర్. మా అమ్మొచ్చింది కదా నాకిప్పుడే సంక్రాంతి పండగ.. దసరా పండగా .. ఇగ్గో అమ్మ మీకు ఇమ్మంది. ఎల్లుండి బడికి వస్తా కోపమొద్దు టీచర్ .." ఓ కనకాంబర మాల అర్చన చేతిలో పెట్టి తువ్వయిలా పరుగున వెళ్ళిపోయింది. మళ్ళీ ఎన్నాళ్ళకో తప్ప కనపడని అమ్మ కోసం పాలపిట్టల రివ్వున ఎగిరిపోయింది. అమ్మ వెళ్ళాక వంటరి పిచ్చుక అది. చాల చిన్నతనం లోనే రెక్కల బలం పుంజుకుంటున్న తెంపరి పిచ్చుక. "కావేరిని వాళ్ళ అమ్మ తీసుకెళ్ళి పొతే ఎంత బాగుండు. ఏం మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయిని ఇక్కడే వదిలి వెల్లాలా ..? ఎలా వెళ్ళింది ఆమె..?  అసలు ప్రాణమెలా వప్పింది ఆమెకి ?" అర్చనలో ఎన్నో ఆలోచనలు 
                                             *  *  * 

        బస్  ఒక్కో మలుపు తిరుగుతుంటే . చల్లని గాలి  రివ్వున ముఖాన తాకుతున్నది. ఏ వయిపు చూసినా చూసిన పచ్చందనాలు ఆరబోసి ఉన్నాయి. విరగ కాసిన పత్తి చేలు పచ్చని నేలపయి చుక్కల ముగ్గు పెట్టినట్లుగా ఉన్నది. మరో వయిపు పూతకు వచ్చిన  లేతాకు పచ్చని ఆకుల ములగ చెట్లు తెల్లని సన్నని మొగ్గలతో సన్నజాజులు తురుముకున్న కన్నెపిల్లల్లా ఉన్నాయి. కాస్త ముందుకు వెళితే బారులు తీరిన బొప్పాయి మొక్కలు, వర్షంలో గొడుగులు విప్పుకుని నుంచున్న బడి పిల్లల్లా ఉన్నాయి. దూరాన కొండల పాదాల చెంత పత్తి, మిరప , బెండ , రకరకాల పంటలు పచ్చబారి ఉన్నాయి. మలుపులు మలుపుల మట్టి రోడ్డు పయి మెలికలు మెలికలు తిరుగుతూ వెళుతున్న పల్లె వెలుగు బస్సు కిటికీ నుండి తల తిప్పకుండా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆలోచనలో పడింది .. 
     "కావేరి వాళ్ళ అమ్మ ఇక్కడ ఉండదట కదా.." కావేరి  గురించి మరింత తెలుసుకోవడానికి శారద టీచర్ ముందు కావేరి ప్రస్తావన తెచ్చింది 
   "అవును అర్చన గారు.. లాస్ట్ ఇయర్ నేనే వాళ్ళ క్లాస్  టీచర్ ని. ఇప్పుడు రిజిస్టర్ లో తల్లి పేరు కూడా తప్పని సరిగా రాయాలని రూల్ వచ్చింది కదా..! ఈ కావేరి తండ్రి పేరు రెడపంగి రమేష్. తల్లి మళ్ళీ పెళ్లి చేసుకుంది కాబట్టి ఆమె ఇంటి పేరు మళ్ళీ మారింది. ఆమె పేరు కృష్ణవేణి.. ప్రస్తుతము అద్డంకి కృష్ణవేణి. మరి రిజిస్టర్ లో ఏమి రాయాలా అని నాకు అనుమానం  వచ్చింది. కావేరి పుట్టినప్పుడు ఇంటి పేరు రెడపంగి కదా.! మధ్యలో వాళ్ళ అమ్మ ఇంటి పేరు మారిందని ఎవరికీ తెలుసు. మొదటిదే రాయండి అన్నారు మిగితా టీచర్లు.  ఏమో నాకు ఇంకా ఈ అనుమానం తీరలేదు.. "చెప్పింది శారద  
    అర్చనకు కావేరి ఇంటి పేరు చరిత్ర గురించి మాట్లాడాలని లేదు. కానీ ఓపికగా విన్నది. కావేరి అమ్మమ్మ పెద్ద వయసుది ఆమె కదా.  రేపొద్దున్న ఆమెకేమయిన అయితే కావేరిని ఎవరు చూసుకుంటారు. ఆమె ఆర్థిక పరిస్తితి అంతంత మాత్రమే. కావేరి వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్లి ఉండవచ్చు కదా.." ఎన్నో ప్రశ్నలు దూరాన చేలో ఓ చిన్న పిల్ల.  కావేరిలాగే అనిపించింది. వాళ్ళ అమ్మ వెళ్లిపోయి ఉంటుంది. అమ్మమ్మతో  పాటు పనికి వెళ్లి ఉంటుంది. భారంగా నిట్టూర్చింది. అర్చన దిగాల్సిన స్టేజ్ వచ్చేసింది .. 
     వీళ్ళను చూడగానే ఆటో వాడు ముఖం అటు వయిపుకు పెట్టుకుని నిల్చున్నాడు.. "అబ్బో ఆ తండాకు ఎవరు వస్తారు తిరిగి వచ్చేటప్పుడు ఖాళీగా రావాలి.. కుదరదమ్మా" లాంటి నిత్య స్తోత్రం చదివాడు. మా అయ్యగా మా తండ్రిగా  అన్న రీతిలో బతిమాలి అతను అనుకున్న సొమ్ము చెల్లిస్తానికి ఒప్పుకున్నాక  రావడానికి సిద్దమయ్యాడు. ఆటోలో ప్రయాణిస్తూ ఆ చేలో ఉన్నది  రెడపంగి కావేరి అవునో కాదో ఇవాలయినా బడికి వస్తుందో రాదో  అని ఆలోచిస్తూ బడి చేరుతుండగానే "టీచరొచ్చింది. టీచరొచ్చింది.. గుడ్ మార్నింగ్ టీచర్.."  అనుకుంటూ దుమ్ము రేపుతూ పిల్లలు ఎదురు వచ్చారు. అర్చనకు ఎంతో ఇష్టమయిన అ పలకరింపులకు మనసు ఎప్పటిలా మురిసిపోయింది. సమయానికి బడికి చేరినందుకు తేలిక పడిన మనసుతోనవ్వుతూ బడిలోకి అడుగు పెట్టింది అర్చన. 
      ప్రార్థన ముగిసి క్లాసుకి వెళ్ళాక ఎప్పటిలా హాజరు తీసుకోవడం మొదలు పెట్టింది.  కావేరి పేరు దాగరకు రాగానే "రెడపంగి కావేరి  రాలేదు టీచర్ "అని ఒకరికిద్దరు అరిచారు. భారంగా నిట్టూర్చి.. ఆలోచనలను పక్కన బెట్టి పాఠంలో పడింది. పిల్లలకు రాత పని ఇచ్చింది. కస్సేపయ్యాక పాముల సావిత్రి అర్చన పక్కన చేరి "అసల్కయితే టీచర్. రెడపంగి కావేరిని వాళ్ళమ్మ ఏనాడో రమ్మన్నది. ఈమెనే పోలేదు. మాలావు పొగరు పిల్ల" అన్నది.
 "నువ్వు ముందు పాఠం రాసి చూపించు సావిత్రి" ..కోపంగా అన్నది అర్చన. 
       
                                                  *  *  *
      ఆ మర్నాడు కావేరి వాళ్ళ అమ్మమ్మ బడికి వచ్చింది. ఆమె వెనుకే దాక్కుని తల బయటకు పెట్టి బెదురుగా చూస్తూ కావేరి .. 
    "ఏంటి రంగమ్మ కావేరి ఇట్లా మాటి మాటికి బడి మానేస్తే ఎట్లా..? వాళ్ళమ్మ దగరకో నాన్న దగ్గరకో పంపిస్తే కాస్త భయం ఉంటుంది కదా.! అది మాటి మాటికి బడి మానడం నువ్వు వచ్చి ఏవో కథలు చెప్పడం మాములయ్యి పోయింది.." కోప్పడ్డారు హెచ్చెం గారు.
  " లేదు సార్ నాకే పాణం మంచిగా లేకుండే ఇకనుండి మంచిగా పంపుతాను.." అని చెప్పి  అర్చన దగ్గరకు వచ్చింది.
  "వీళ్ళ నాయిన దగ్గరకు పంపడానికి వాడో తాగుబోతు.  పిల్ల ఎటూగాని వయసులో ఉన్నది అది గాక వాడు దొరల దగ్గర రౌడీ. అది తెలియక నా కూతుర్నిచ్చి చేసి నానా తిప్పలు బడ్డ.. ఇడాకులు అయినంక గూడా తాగొచ్చి లొల్లి లొల్లి జేస్తున్నాడు. ఇట్లా కాదని పెద్ద మను
ష్యులకు  జెప్పి ఆళ్ళను ఈళ్ళను బతిలాడి నా బిడ్డకు  మళ్ళీ పెళ్లి చేసిన బిడ్డా. అల్లుడు మంచోడే పెళ్లయిన కొత్తలో అప్పుడే చిన్న ఈ పిల్లనెందుకు పంపాలే అని పంపలేదు. ఇగ ఎంటంటనె రెండు కాన్పులాయే.. కావేరి గూడ ఎల్లి ఉన్నది. నా దగ్గర కొన్ని రోజులు వాళ్ళ దగ్గర కొన్ని రోజులు  రెండు మూడేళ్ళు అట్లాట్ల మంచిగానే ఉన్నది .ఇగ ఆ కాడి నుండి నా మీద  బెంగ బెట్టుకుని ఇగ ఆడికి బోను నీ కాడ నే ఉంటాను అన్నది ఏమి జేతును బిడ్డ.." చాల సేపు మాట్లాడి కావేరిని కూర్చో బెట్టి వెళ్లి పోయింది. 
                                              *  *  *
      ఆ రోజు సాయంత్రం బస్ కోసం ఎదురు చూస్తున్నది అర్చన. ఆకాశమంతా మబ్బులు పట్టి చీకట్లు కమ్ముకున్నాయి. ఎప్పటిలా బడి ఆవరణలో పిల్లలు ఫుట్ బాల్  ఆడుతున్నారు. మబ్బులు పట్టడంతో కొందరు పిల్లలు ముందుగానే వెళ్లిపోయారు. ఎవరు ఉన్న వెళ్ళినా కావేరి మాత్రం అర్చన వెళ్లాకే వెళ్తుంది ..
"అసలు నువ్వు మా ఊర్లోనే ఉండు టీచర్. ఈ పోవుడు వచ్చుడూ బాధ ఉండదు." నవ్వింది కావేరి
"ఇంట్లో నీలాంటి.. ఓ చెల్లి, అక్కా ఉన్నారమ్మా. ఆరోగ్యం బాగుండని అత్తగారు ఉన్నారు. డాక్టర్ కి అందుబాటులో ఉండాలి. ఆమె కోసమే ఈ పరుగులు.." చెప్పింది అర్చన 
    "మా అమ్మ వాళ్ళ అత్తగారు కూడా మా అమ్మతోనే ఉంటది టీచర్. మొదట్లో మా చెల్లె పుట్టినప్పుడు నేను చాల పనులు చేసేదాన్ని. మా నాయినమ్మ అదే అశోక్ నాన్న వాళ్ళ అమ్మ.. ఏ పని చెప్తే అ పని చేసేదాన్ని. అప్పుడు నన్ను మంచిగానే చూసుకున్నది. మా తమ్ముడు పుట్టినప్పుడు ఆమెకి కొద్దిగా భయం పట్టుకున్నది." కావేరి చదువు మనమే చదివించాలా..?" " ఆమె  పెండ్లి కూడా మనమే చెయ్యల్నా..?" అని అనుడు మొదలు బెట్టింది. ఇగ మా అమ్మతో గొడవలు మొదలయినయి. "కావేరికి నాయినా ఉన్నాడు కదా.. నా కొడుకు ఎన్నని చూస్తడు. ఆడికి బంపు "అనడం  మొదలు పెట్టింది. 
     "మా రెడపంగోళ్ళలో నాకు వచ్చే ఆస్తి పంచుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఒక చిన్న ఇల్లు నాలుగెకరాల పొలం ఉన్నది. కాని మా నాయిన ఇట్లనే తాగి అందరితో గొడవలు పెట్టుకుని అన్ని అమ్ముకుంటుంటే.. మా  రమేష్ నాన్న నాకు ఇగ ఏమి మిగల్చడని వాళ్ళ బాధ. మా అమ్మోళ్ళ అత్త గారికి నేను బోయి ఆడనే కూసుంటే ఆయనే చదివి పిస్తడని.. ఆయనే పెళ్లి జేస్తడని ఆమె మసులో పడింది  టీచర్. ఇగ మా పూట పూటకు మా అమ్మతో లడాయి పెట్టుకుంట మా  అమ్మను చెరలు బెడ్తున్నది. మా అశోక్ నాన్న మా అమ్మని ఏమి అనలేక నడుమ మా అమ్మనే తిడుతున్నాడు. ఇగ రోజూ ఆమె మా అమ్మ ఆడిబిడ్డలు మా అమ్మను తిట్టుడు .. మా అమ్మమ్మని, మా అస్సలు నాన్నను తిట్టుడు.. ఇదే పని. ఇగ మా అమ్మ ఏడ్చింది ఏడ్చినట్టే. నా ఎనక ఎన్నో గొడవలు.. నన్ను జూసి ఆపుడు.. మా అమ్మ వంటింట్లకెల్లి  వెళ్లి ఏడ్చుడు. నేను అన్నే చూస్తానే ఉన్న .." ఒక నిమిషం ఆలోచనగా ఆపింది కావేరి ..
   "ఎన్ని సంద్రాలున్నాయి ఈ చిన్ని గుండెలో.. ఎంతా మాములుగా  చెబుతున్నది తనకు వచ్చిన భాషలో.." అనుకున్న అర్చనకు మాత్రం గుండె పట్టేసినట్లవుతున్నది .. 
         " ఇగ ఒగ నాడయితే  మెల్లె మెల్లగా మొదలయి చాల పెద్ద గొడవయ్యింది. ఆమెకి తోడు మా అశోక్ నాన్న వాళ్ళ చెల్లెల్లు కూడా వాళ్ళ అమ్మదిక్కే మాట్లాడిండ్రు. ఏమన్నారో తెలుసా టీచర్.. అయినా అది రెడపంగోళ్ళ పిల్ల.. ఆ పిల్ల మా వోని ర క్తం కాదు. ఇప్పుడు వానికే ఇద్దరు పిల్లలు. ఈ పిల్ల జర పెద్దగయ్యింది కదా..  మీ అమ్మ కాడికి బంపు.. అప్పుడు ఈ పిల్ల తల్లి దగ్గర లేదు అని వాళ్ళ నాయిననే బాధ్యత తెలుసుకుని ఆస్తి రాసిస్తాడు." అని అన్నది. ఇగ మా అమ్మ అందుకున్నది టీచర్.
       "అవును అది రెడపంగోల్ల పిల్లనే.. నన్ను ఆయన పెళ్లి జేసుకున్నప్పుడు తెలియదా. నాకు బిడ్డ ఉన్నదని..? అది కూడ నా కాడనే ఉంటదని.. దాన్ని ఆడికి ఈడికి బంపి దాన్ని దిక్కులేని దాన్ని చెయ్యను. కన్న తల్లిని నేను ఇంకా బతికే ఉన్నా. నా బిడ్డకు నేను ఇంత తిండి పెట్టి పెంచలేనా. సచ్చినా ఆ తాగుబోతు దగ్గరకు నా పిల్లను పంపను. ఇదిగో అత్తమ్మా  నాతో గొడవ పెట్టుకుంటే మంచి గుండదు.  ఈ కష్టాలు నాకు కొత్త కాదు. నువ్వు ఇట్లానే లొల్లి పెట్టుకుంటే నేను నా  ముగ్గురు పిల్లను తీసుకొని పోయి ఎక్కడయినా కూలి నాలి చేసుకునయిన బతికిన్చుకుంటా.." అని గట్టిగ చెప్పింది. ఆ రాత్రిల నన్ను దగ్గరకు తీసుకొని.."నేను మళ్ళీ  పెళ్లి చేసుకుని తప్పుజేసిన బిడ్డ.. నిన్ను వదలనే తల్లీ" అని మస్తు ఏడ్చింది. నేను కూడా మస్తు ఏడ్చిన.."కావేరి ఆగకుండా చెబుతుంటే అర్చన చెంపలు తడిచిపోతున్నాయి. 
      " దేవుడు పిలిసినట్టే ఆ రెండు రోజులకే మా అమ్మమ్మ వచ్చింది. మా అమ్మమ్మ వెళ్ళేటప్పుడు నేను కూడా వస్తా అని గొడవ చేసిన. అమ్మ నేను అమ్మమ్మ దగ్గర పది రోజులు ఉండి వస్తా.." అని చెప్పిన. సరే అని పంపింది మా అమ్మ అప్పుడు నేను అయిదోది చదువుతున్నా. ఈడ బడిల చేరిన. అంతే ఇగ మా అమ్మ ఎన్నిసార్లు పిలిచినా, ఎంత ఏడ్చినా నేను మళ్ళీ మా అమ్మ దగ్గరకు పోలే. మా అమ్మ మంచిగుంటే అంతే చాలు కదా టీచర్.. మొదలే మా రమేష్ నాన్నతో మస్తు తిప్పలు పడింది. ఇప్పుడు నా మూలంగా మల్లా బాధలు పడకూడదు. అందుకే ఎప్పుడన్నా ఎల్లినా నాలుగు రోజులుండి వచ్చేస్తా.. " 
     అసలు ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు. "అమ్మ ప్రశాంత జీవితానికి తానూ ఆటంకం కారాదని ఎంత బాధ్యత తీసుకున్నది ఈ చిన్న తల్లి. ఎవరు నేర్పారు తనకు ఇంతటి ఔదార్యము..! " అర్చన మూగబోయింది. గల గలా మాట్లాడుతూ కావేరి గుండెలో భారం దింపుకున్నది. దుఃఖభారంతో అర్చన గుండె బరువెక్కిపోయింది. కావేరి అర్చనకు చేరువగా వచ్చి గొంతు బాగా తగ్గించి.. 
     "టీచర్ .. అప్పుడప్పుడు మా అమ్మకు బాగా జరం రావాలని.. మా అమ్మమ్మ దగ్గరకు వచ్చి పది రోజులు ఇక్కడే ఉండాలని దేవునికి దణ్ణం పెట్టుకుంటా.. పోనీ నాకే జరం రావలె.. మా అమ్మ రావలె.. అని దణ్ణం పెట్టుకుంటుంటా. అట్ల కోరుకోవడం తప్పే కదా..! కానీ ఏమి చెయ్యాలా మరి అప్పుడప్పుడన్నా మా అమ్మను చూడాలే కదా" అర్చన కళ్ళలోకి చూస్తూ అడిగింది. 
     ఆర్చన కావేరిని గట్టిగా గుండెలకు హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చేసింది. "ఇలా దగ్గరకు తీసుకోవడం తప్ప ఏమి చెయ్యగలనీ పిల్లకోసం.." అనుకున్న అర్చన మనసు మరింత భారమయ్యింది. మబ్బులు మరింతగా కమ్ముకున్నాయి.  చీకట్లు మరింతగా ఆవరించాయి.. 
దూరంగా బస్ వస్తున్నా హారన్ వినపడింది.. "చీకటి పడింది జాగ్రత్తగా ఇంటికి వెల్లు..!" తల్లీ అన్నది 
       "సరే టీచర్ .. నువ్వు కూడా జగ్రత్తగా వెల్లు టీచర్ " నవ్వింది కావేరి
       ఆ మసక చీకట్లో కుంకుడు గింజలంటి కావేరి కళ్ళు మరింతగా మెరుస్తున్నాయి. అప్పుడే ఒక మెరపు మెరిసింది. ఆ మెరుపులో కావేరి కళ్ళు మరింత మెరిసాయి.
     అర్చనకు "ఈ పిల్లలో ఏదో ప్రత్యేకత ఉందీ అదేమిటో అర్ధం కావడం లేదు.." అనుకున్న ప్రశ్నకు బదులు దొరికింది. అవును కావేరి కళ్ళు మెరిసాయి.. కన్నీటి కొలనులోని చేపల్లా మెరిసాయి. ఆ కన్నీటిని చెంపలకు పాకకుండా అక్కడే నిలిపి.. ఆ పెదవులనుండి చిరునవ్వు జారి పోకుండా అక్కడే ఒడిసి పట్టిన విద్యేదో చాలా చిన్న నాడే నేర్చేసుకున్నది.. అదే కావేరి ప్రత్యేకత.. 

-
సమ్మెట ఉమాదేవి