About Me

My photo
Published two books viz., Relapoolu, Amma Kathalu. అమ్మ కథలు, రేలపూలు

Saturday, July 7, 2018

కేస్లా



           దూరం నుండి చూస్తుంటే అతనో ఎలుగుబంటిలా అనిపిస్తున్నాడు. ఆ చెట్లల్లో అతనో చెట్టులా కనిపిస్తున్నాడు. మురికిబారిన బట్టలతో పెరిగిన జుట్టూ-గడ్డంతో చిన్నప్పుడు విన్న కథల్లో ఒంటికన్ను రాక్షసునిలా అనిపిస్తున్నాడు. ఆ అడవిదారిలో ఏమి తింటున్నాడు? ఎక్కడ పడుకుంటున్నాడు? ఎలా బ్రతుకుతున్నాడు? చలికి వానకు చలించడా? ఆకలి ఉండదా? అతన్ని చూస్తున్న అందరిలో కలిగే ప్రశ్నలివే. గంటలతరబడి అతను బిగుసుకు పోయినట్టు ఆ చెట్లకింద కూర్చుని ఉంటాడు. ఉండుండీ అడవిలోకి మాయమైపోతుంటాడు. మళ్ళీ ఆ చెట్లకింద చేరి అటూఇటూ తిరుగుతూంటాడు. ఒకింత భయం మరొకింత గగుర్పాటు కలుగుతున్నా ప్రతినిత్యం ఆ దారిలో అతనున్నాడో- లేడాని ఓసారి పరికించి చూసి ఉంటే హమ్మయ్య ఉన్నాడు అనుకోవడం, కనపడకపోతే అయ్యోపాపం ఎక్కడికెళ్ళాడో ఏమో..ఏమైనా అయిపోలేదు కదా అని అనుమానపడడం ఆ దారంట వెళ్ళేవాళ్ళకి మామూలైపోయింది.

        తన గురించి జనం ఏమనుకుంటున్నారో అతనికి పట్టదు. తన ప్రక్కనుండి ఎవరు వెళ్తున్నారో ఏమంటున్నారో  ఎందుకు నవ్వుకుంటున్నారో ఎందుకు జాలి పడుతున్నారో ఎందుకు బాధపడుతున్నారో అతనికి అక్కరలేదు. ఒక్కోసారి సన్నగా ఏదో గొనుక్కుంటుంటాడు..ఒక్కోసారి గుండెలు పగిలేలా రోదిస్తాడు. ఒక్కోసారి గొంతు చించుకుని రంకెలు వేస్తాడు. దూరం నుండి ఎవరన్నా ఓ రొట్టెముక్కో, పండో-ఫలమో విసురుతుంటారు. అతను తింటాడో లేదో కూడా తెలియదు. ఎలా తింటాడు? ఓ పక్కంతా చెంప కాలిపోయి పళ్ళూ - చిగుళ్ళూ భయంకరంగా కనిపిస్తూంటాయి. ఏదైనా తినబోతూంటే ఓ పక్కనుండి జారిపోతుంటుంది. ఏదైనా మాట్లాడబోతే పదాలు తొస్సిపోయినట్టు వింతగా ధ్వనిస్తాయి. అసలు ఆకలి చచ్చిపోయినట్టు.. తిండిమీద ధ్యాసే లేనట్టు ఉంటాడు. ఇక కనుగుడ్డు బయటకు పొడుచుకు వచ్చి మెడంతా వళ్ళంతా కాలిపోయిన మచ్చలతో భీతిగొల్పుతుంటాడు .ఎవరు అతని దగ్గరకు వెళ్ళడానికి సాహసించరు. ఓ మౌనిలా మౌనంగా..ఓ యోగిలా నిర్వేదంగా అలా గంటలకొద్దీ ఏకాంతంగా కూర్చుని ఉంటాడు.
                     *    *    *
     " కేస్లా....ఒరే కేస్లా! " ఏదో ఆత్మీయమైన పిలుపు. అతని మౌనాన్ని భగ్నం చేస్తూ ఓ పిలుపు. అతన్ని మనిషిగా గుర్తిస్తూ.. ఓ పలకరింపు. కేస్లాకు దు;ఖం ముంచుకొస్తున్నది. ఎందరెందరో అదే దారినుండి నడిచి వెళ్తూ భయం భయంగా తొలగిపోతూంటారే..! ఎవరు తనను ఇంత ఆర్తిగా పిలుస్తున్నది?
         మళ్ళీ అదే పిలుపు..." కేస్లా..ఒరే కేస్లా! ఆగరా..ఆగు..." అది ఓ స్త్రీ స్వరం.. ఎవరో బాగా తెలిసిన వాళ్ళే పిలిచినట్లు... ఎవరో తనని .మ్మంటున్నట్లు అనిపిస్తున్నది. దూర తీరాలలో ఆ పిలుపు ఎవరిదో.. ఊహూ వద్దు... ఇంకా ఈ మనుష్యులతో బంధాలు వద్దు వద్దు.. ఆ పిలుపు అందనంత దూరం పరుగుపెట్టడం మొదలుపెట్టడం మొదలుపెట్టాడు. పరుగు..పరుగు.. ఆ పిలుపు అతన్ని వెంటాడుతూనే ఉంది." కేస్లా ఆగు అలా ఉరకకు.. నా మాట విను.. ఒక్కసారి ఆగు .." అది పిలుపులా లేదు. ఏదో పాటలా ఉంది. అవును అది చిన్ననాడు అందరూ ఆమె చుట్టు చేరి అడిగడిగి పాడించుకున్న పాటల స్వరం. తమ కర్తవ్యాలను గుర్తు చేస్తూ మందలించిన భాస్వర స్వరం. తమను అప్రమత్తం చేస్తూ తమ పనులకు సమాయుత్త పరిచిన కంచు స్వరం. తమను కొత్తలోకం చూపుతూ కార్యోన్ముఖులను చేసిన బంగరు స్వరం.

        మరపుపొరలు విడిపోతున్నాయి. ఆ పిలుపును తన ఆత్మబంధువు స్వరానికి జతచేస్తున్నాయి. అవును. మాల్యా. ..అది మాల్యక్క గొంతు. కేస్లా మరింత వేగంగా, ఆమె తనను చేరుకోలేనంత దూరం పరుగెత్తి పరుగెత్తి వగరుస్తూ ఓ దగ్గర మోకాళ్ళ మీద కూలబడిపోయాడు. "వద్దక్కా...! నువ్వు నా దగ్గరకు రావద్దు. నాకు మళ్ళీ ఈ మనుష్యులతో సంబంధాలు వద్దు. నన్ను చంపేసిన ఆ తండాలు వద్దు. నన్ను బతుకనివ్వని ఈ ఊర్లూ వద్దు. అసలు నాకు బతకాలని లేదు. మళ్ళీ నన్ను పిలవకు. మళ్ళీ నీ దరి చేరనివ్వకు. జీవితమంటే ఆశలు రేపకు." మోకాళ్ళలో ముఖాన్ని దాచుకుని వెక్కివెక్కి ఏడుస్తున్నాడు కేస్లా.
       
ఆ దు;ఖం వరద నీరై పొంగగా పొగిలిపొగిలి ఏడుస్తున్నాడు. ఇన్నాళ్ళు మూగ వేదన కరిగిపోయేలా పసి పిల్లాడిలా స్వేచ్చగా బిగ్గరగా ఏడుస్తున్నాడు. తడబడుతున్న అడుగులతో తూలుతూ పిచ్చివాడిలా ఏడుస్తున్నాడు. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి ఎప్పటికో తేరుకుని నీటి చెలమను చేరుకున్నాడు. ఎప్పటిలా తన ప్రతిబింబాన్ని చూసుకున్నాడు. ఎప్పటిలా ...ముఖాన్ని చేతుల్లో దాచుకున్నాడు...ఎప్పటిలా..మరల మరలా కుమిలిపోతూ ముఖం కడుక్కున్నాడు. దోసిళ్ళతో నీరు తాగి..ఓ రాతిమీద కూర్చున్నాడు. నీటిలో అతని ప్రతిబింబం అలలతో బాటుగా భయంకరంగా కదులుతున్నది.
                                   *     *     *
       అప్పుడే బస్సు దిగిన కేస్లానాయక్ తన వారిని చేరుకోబోతున్న ఆనందంతో వడివడిగా తండా వైపుకు రాసాగాడు. తండాలోని తన ప్రియమిత్రులతో ఆడే పులిమేకౌ, చెడుగుడులు, కుస్తీలూ..కోలాటాలూ...కోడిపందాలూ, వ్యవసాయ పనుల్లో పాడుకొనే పాటలు, విసురుకునే చలోక్తులూ, వాగుల్లో ఈదుకుంటూ ఒకరిపై ఒకరు నీళ్ళు చిమ్ముకుంటూ ఒకరిని ఒకరు ముంచుకుంటూ ఆడే ఆటలు, వేగంగా నడవడంలో కొండలెక్కడంలో పెట్టుకునే పందాలు, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా పని ఒక్కరిదైతే వారితో నడకలు, ఉరుకులు పరుగులు అల్లరి కేరింతలు అందరివి. తండాలోని మిత్రబృందమంతా కలిసి తమ కబుర్లతో నడకలతో అడవికి సందడి తెచ్చేవారు. చిరపరిచితమైన ఆ వని పరిసరాలను కన్నుల నింపుకుంటూ ఉల్లాసంగా నడక సాగించాడు.
         అల్లంత దూరం నుండే కేస్లా రాకని గమనించిన పరివారమంతా ఎదురొచ్చి ఆప్యాయంగా పలుకరించసాగారు. తండా నుండి ఒకడు ఇంజనీర్ చదువుతున్నాడంటే వాళ్ళకెంత సంబరమో..తండ్రి సూక్యా కొడుకును మురిపెంగా కళ్ళనిండా చూసుకున్నాడు. తల్లి నాజ్కి కొడుకును అల్లుకుపోయి వళ్ళంతా తడుముతూ పెద్దగా రోదించింది. బంధువులంతా గొంతు కలిపారు. చాన్నాళ్ళకు తమ వారిని కలుసుకోగానే రోదనతో ఆనందం వ్యక్తం చేయడం అక్కడ సాధారణమే. కానీ తన బంధువుల రోదనలో ఏదో తేడా తెలుస్తున్నది. ఆ రోదనలో తీవ్ర వేదన కనబడుతున్నది. తనను అల్లంత దూరాన చూడగానే పరుగులు పెట్టుకొచ్చే మిత్ర బృందం చాలామంది కనబడనేలేదు. అతని అనుమానం నిజం చేస్తూ...
       "
నీ దోస్తులను ఠాణాలబెట్టిన్రు కొడుకో..ఆళ్ళు ఏమి జెయ్యకుండనే తీస్కపోయిండ్రు కొడుకో..! ఆడ నా కొడుకును మస్తు కొడుతాండ్రంట కొడుకో.." అంటూ పార్వతి..లచ్చిమి ఏడవసాగారు. కేస్లా కుంగిపోయాడు.
      "
ఏమిటిది? ,అళ్ళీ తీసుకెళ్ళారా? ఇట్లా ఎప్పుడుపడితే అపుడు తమవాళ్ళను తీసుకెళ్ళడం, 'వాళ్ళ' ఆచూకీ చెప్పమని తన్నడం ఇలా ఎన్నిసార్లో..! తన మిత్రులను ఎంత దారుణంగా కొడుతున్నారో అని తలచుకోగానే పట్టరాని దు;ఖం కలిగింది వాళ్ళను ఎలా ఓదార్చాలో తెలియక సతమతమయ్యాడు. పరుగున తాత వాలి దగ్గరకు వెళ్ళి వాలాడు. "ఇప్పుడెట్లా తాతా..? కలవరంగా అన్నాడు. "ఎట్ల ఏమున్నదిరా ఎవ్వళ్ళనో ఒకళ్ళను పట్టుకోవాలెగదా మరి. కడుపు తిప్పలుకు జవాన్లు వాళ్ళ బాధలు వాళ్ళు బడుతున్నరు. అయినగాని అసల్కి మనోళ్ళకు మాత్రం ఏందెలుసని చెప్తరు బిడ్డా! తూరుపు దిక్కున సుక్క భడుస్తదని తెలుసుగానీ ఎవ్వళ్ళకన్న దానిపట్ట వశమా..! మెరుపుతీరు అస్తరు.. వెలుగుతీరు సాయంజేస్తరు. నీడతీరు దొర్కకుంటబోతరు. ఏడుంటరంటే ఏం జెప్పేము? ఆళ్ళనుబట్టుకోను ఎవ్వళ్ళతోని గాదని వీళ్ళకు గూడా ఏర్పాటే. పట్టుకున్నట్టు శకలు జెయ్యాలేగదా," నవ్వాడు వాలి. విస్మయంగా చూసాడు వాళ్ళంటే ఎంత ప్రేమ, నమ్మకం.
          "
అదంతేమో గానీ తాతా..! నడుమ మనోళ్ళు బలైపోతున్నరు. ఫారెస్టోల్లకు, పోలీసోల్లకు, మనం ఇట్లా వుపయోగపడుతున్నం కదా!" అనుకుంటూ తూరుపు కొండలవైపు అడుగులు వేయసాగాడు. ఆ తూరుపు కొండలను చూస్తుంటే చాలు కేస్లాలో ఏదో ఉత్తేజం కలుగుతుంది. ఎవరో అక్కడ సంచరిస్తున్నట్టుంటుంది. కానీ ఎప్పుడూ ఎవరూ కంటపడరు. ఏదో అలికిడి తెలుస్తుంటుంది . కానీ స్పష్టమవ్వదు. ఆ ఉనికికే ఏదో ప్రేరణ కలుగుతుంటుంది. అపుడపుడు అకస్మాత్తుగా తమవారు వండిపెట్టే అన్నం, కూరలు ఎక్కడికి వెళ్తాయో తెలియదు. ఒక్కోసారి అర్ధరాత్రులు తమ గుడిసెలో తమ పక్కనే పడుకున్నట్లనిపించే. ఆ మామా, అత్తా, కాకా, చిన్ని..ఎవరన్నది తనకు చిన్ననాటినుండీ తెలియదు. మర్నాడు ఎవరిని ఎంత తరచి అడిగినా గంభీర మౌనమే తప్ప జవాబు దొరికేది కాదు. వాళ్ళు ఎప్పుడు ఎక్కడ పంచాయితీ పెట్టి తీర్పు చెప్తారో గాని, ఆ తీర్పు వాళ్ళందరికీ శిరోధార్యం. ఎవరైనా ఏదైనా కానిపని చేయబోయారో, తమనెవరో కనిపెడుతున్నట్టు టక్కున ఆపేస్తారు. మామూలప్పుడు చలోక్తులతో, పాటలతో చెలరేగిపోయే వాళ్ళంతా వాళ్ళ ప్రస్తావన వచ్చేసరికి మౌనంగా..గంభీరంగా మారిపోతుంటారు. ఆ మౌనంలో ఓ భక్తి, ఓ భయం నియమం ఉంటాయి. అపుడపుడు కొన్నాళ్ళు తమతో ఉనంట్టే ఉండి కొన్నాళ్ళకు కనిపించకుండా పోయే వాళ్ళ మాటలు వాళ్ళు పాడే పాటలు ఎంత ఉత్తేజకరంగా ఉంటాయి. వాళ్ళు వెళ్ళిపోయినా కేస్లాకు ఇతర పిల్లలకు దస్రూ కాక బిడ్డ మాల్యక్క ఆ పాటలన్నీ పట్టేసి పాడి వినిపించేది. రమేశ్, లాలూ, వాళ్ళు చెప్పే మాటలన్నీ మంత్రాల్లా వప్పజెప్పేవారు. కొన్నేళ్ళకు మాల్యక్క కనబడకుండా పోయినప్పుడు, తల్లడిల్లిపోయి కేస్లా చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. కాని మాల్యక్కా వాళ్ళ అమ్మానన్న మాత్రం ఓ నిట్టుర్పు విడిచి ఊరుకున్నారెందుకో అర్థమయ్యేది కాదు. ఇపుడెందుకో ఆ తూరుపు కొండలు చూస్తుంటే దు;ఖం కలుగుతున్నది. పోలీసులు అరెస్టు చేసిన తనవాళ్ళు ఎలా వస్తారో అర్థం కావడం లేదు. దు;ఖసాగరంలో మునిగిన తనవాళ్ళను ఏ రకంగానూ ఓదార్చలేక బాధపడ్డాడు కేస్లా.
          
రెండురోజులు గడిచాయి. మిత్రుడు తిరిగి రాలేదు. కేస్లా మనసేదో కీడు శంకిస్తున్నది. ఇంకా ఠాణా నుండి తన నేస్తాలు తిరిగి రాలేదు. ఇపుడేకాదు. అలా పోలీసులు తమవాళ్ళను తీసుకువెళ్ళిన ప్రతిసారీ ఏనాడూ వాళ్ళు క్షేమంగా తిరిగి రాలేదు. వళ్ళంతా గాయాలతో జీవచ్చవాల్లా వచ్చేవారు. వాళ్ళు కోలుకోవడానికి కొన్ని నెలలు పడుతుంది. మమ్ముల్నెందుకు తీసుకెళ్తున్నారు? అని అడిగే ధైర్యం ఎవరికీ లేదు. కేస్లా అనుమానం నిజం చేస్తూ అర్ధరాత్రి ట్రాక్టర్ వచ్చింది. అందులో వళ్ళంతా గాయాలతో కిషన్ లాల్. బిక్కూనాయకే మాత్రమే వచ్చారు. కేస్లాను వాటేసుకుని గాయపడ్డ ప్రాణమిత్రులు దీరులాల్..రాం నాయక్ దీనంగా రోదించారు. హర్యా ఎందుకు రాలేదు? అని అడగగానే ఏమో..రేపెల్లుండి  ఇడిసి పెడతమన్నరు....అన్నారు. అందరూ గాయపడి మూలుగుతున్న కిషన్ లాల్ ను బిక్కూనాయక్ ను చూస్తూ ఏడుస్తున్నారు. హర్యాని మరి ప్రాణాలతో చూస్తామాని కేస్లా..హర్యాలాల్ తల్లిదండ్రుల గుండెలు తల్లడిల్లిపోతున్నయి. మూడురోజులు గడిచాకా పిడుగులాంటి వార్త తండాను చేరింది. లాకప్ లో ఉన్న హర్యా ఆత్మహత్య చేసుకున్నాడని. కోక్యా తండా శోక సముద్రంలో మునిగిపోయింది. కేస్లా తీవ్రంగా చలించిపోయాడు. హర్యా ఆత్మహత్య చేసుకోలేదని, చంపబడ్డాడని చాలా మందికి తెలిసీ ఏమీ చేయలేని నిస్సహాయత... హర్యాను తలుచుకుని నిస్సహాయంగా ఏడ్సుకున్నారు.
                                                       *   *   *
        హర్యా మరణం కొందరు నాయకులకు శవ రాజకీయాలు నడపడానికి బాగా పనికి వచ్చింది. ఇరవై నాలుగ్గంటల చానెళ్ళకు ముఖ్య వార్త అయి రోజును నింపింది. విద్యార్థులు తరగతులు బహిష్కరించి ర్యాలీలు తీసి రెండు బస్సులు తగలబెట్టడానికి పది షాపులు ధ్వంసం చేయడానికి కారణం అయ్యింది. వార్త పత్రికలకు మర్నాటికి పతాక శీర్షికలు, కాసిన్ని వార్తలు దొరికాయి. హర్యా తల్లిదండ్రుకు మాత్రం పుత్రశోకం తండాకు పుట్టెడు శోకం మిగిలింది. పదిహేను రోజుల తర్వాత ధన్ బాద్ చేరుకున్న కేస్లా హాస్టల్ లో ఉన్న స్నేహితులతో తన బాధను పంచుకున్నాడు. యునాని మెడిసన్ చదువుతున్న మిత్రులు రాఘవా ఈశ్వర్ లతోబాటు సామాజిక శాస్త్రంలో రీసెర్చ్ చేస్తున్న వినయ్ నరేంద్ర అప్పటికే రెండు మూడుసార్లు కేస్లాతో..కోక్యా తండాకు వచ్చారు.వారు మరింత ఆసక్తిగా వింటున్నారు.

         కాలం ఎంతటి గాయాన్నైనా మాంపుతుందంటారు. మా తండా వారి ఆకలిని శ్రమను, బాధలను మరిపించే ఆయుధాలు వారి చెంతే ఉన్నాయి. కూడుంటే కూరుండదు..కూరుంటే కూడుండదుగానీ, చేల దారుల్లో అప్పుడే తీసిన తాటికల్లు ప్రత్యేకంగా తయారుచేసే ఇప్పకల్లు..బంగు...సాయంత్రమయ్యేసరికి పాకెట్లలో దొరికే నాటుసారా..వాళ్ళ కడుపులు నింపుతున్నాయి. కొంపలను కూలుస్తున్నాయి. వైద్యం దొరకక చేసుకునే నాటు వైద్యం వికటించి ప్రాణాలమీదకు తెచ్చుకున్న సందర్భాలెన్నో. ఈ విషయాలన్నీ కేస్లా వివరించి చెబుతుంటే మిత్రులంతా ఆశ్చర్యపోయారు. కేస్లా అలా గంటలకొద్దీ తమతండా గురించి చెబుతుండడం చెవులు రిక్కించి వాళ్ళు ఆసక్తిగా వినడం మామూలే.  అందులో తీజ్ పండుగ ముచ్చట్లు కూడా ఉన్నాయి.

        తీజ్ పండుగ నాడు మా ఆడపడుచుల సందడి చూడడానికి రెండుకళ్ళు చాలవు. గౌరీ పూజ చేసి వేసిన గోధుమ నారు బుట్టలను పెట్టుకుని సాయంత్రం వేళల పాటలు పాడుతూ బతుకమ్మలాడుతారు. చివరి రోజున గణ్ గౌరీ ప్రతిమలు చేసి నైవేద్యం పెట్టిన పరవాణ్ణం కుండలు దాచి అమ్మాయిలను ఏడిపిస్తూంటాం. ఆరోజు మా కుర్రకారంతా ఓ చోట చేరి సందడే సందడి. అమ్మాయిలు ఇవ్వమంటూ గారాలు పోతూ అడుగుతారు.ఆరోజు నేనూ అలాగే సువాలిని ఏడిపించాను. తనకు దొరకకుండా పరుగులు పెట్టించాను. సువాలి నన్ను అందుకోవడానికని నావెనక గంతులేస్తూ వచ్చింది.
       "ఇస్తే ఏమి ఇస్తావు..? అని అడిగాను. " ఏమి కావాలి...? అని అడిగింది. " నన్ను పెళ్ళాడతావా?" అని అడిగాను నేను."ఇంత చదువు చదివిన నువ్వు నన్ను ఎక్కడ పెళ్ళాడనంటావోనని భయపడ్డాను. నువ్వే నన్ను చేసుకుంటానంటే వద్దంటానా" అంటూ సంబరపడిపోయింది. ఆ ఆటలు, ఆ సంబరాలు అలా జరుగుతూనె ఉన్నాయి...ఆ రాత్రే ..నా ప్రాణమిత్రులలో ఇద్దరు తుపాకీలకు బలైపోయారు. కనురెప్పే కాటేస్తుందా...! నిజంగానే నా మిత్రులు ఇంఫార్ మర్లా...! కేవలం అనుమానమేనా? అసలు ఎవరిని నమ్మాలి..? ఏం చెయ్యాలి..? నాతో కలిసి నడకలు నడిచి ఉరుకులు పరుగులు పెట్టి, నాతోపాటు ఆడి పాడిన మిత్రులు నిర్జీవంగా పడి ఉన్నారు. మా తండా జనం భయం గుప్పిట్లో నలిగిపోతున్నారు. వీళ్ళకే కాదు, ఇటు పోలీసులకు భయపడాలి, అటు ఫారెస్ట్ వారికి భయపడాలి. రాజకీయనాయకులకు భయపడాలి. చెప్పలేని దు;ఖంతో కుంగిపోయాను.."
        "నన్ను మరింత కదిలించే మరో సమస్య చేసిన కష్టం మరచిపోవడానికో, అసలు కష్టాలే మరచిపోవడానికో సాయంత్రం అయ్యేసరికి మా తండా వాసులంతా కష్టానికి సుఖానికి అలసటకు తాటికల్లునో ఇప్పసారానో ఆశ్రయించడం. ఈతిబాధలతో వాళ్ళల్లో వాళ్ళే కలహించుకోవడం. "  ఒక నిముషం ఆగి మళ్ళీ మొదలుపెట్టాడు.
       "నా తండాలో జీవితమంటే నాకే విరక్తి కలుగుతున్న సమయంలో  మీరు వస్తామంటున్నారు. సంతోషం..కానీ ముందే చెబుతున్నా మా వాళ్ళు కొత్తవారిని ఎవరినీ త్వరగా నమ్మరు. గతంలో మీరు వచ్చారంటే ఏదో నాలుగు రోజులు ఉండి వెళ్ళే అతిథులుగా ఆదరించారు. ఇపుడు మీరు ఔషధ మొక్కలపై పరిశోధనలు చేస్తున్న విషయం వాళ్ళకు చెప్పినా అర్థంకాదు. వాళ్ళను తాగుడు మానిపించడానికి మీరు చేసే ప్రయత్నాలు బెడిసికొడితే బాధపడకండి.” తన తండాకి మిత్రులంతా బయలుదేరేముందే చెప్పాడు కేస్లా. అన్నిటికీ సిద్ధమై వారు అక్కడే నెలవు ఏర్పాటు చేసుకుని ఉండి వారి కార్యకలాపాలు మొదలెట్టారు.
         అనుకున్నట్టుగానే కొద్దిరోజుల్లోనే తండావారిలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. వాళ్ళను పంపెయ్యమంటూ. కేస్లాకు అన్నివైపులనుండీ వత్తిళ్ళు వచ్చాయి. కేస్లా మిత్రబృందం వినిపించుకోలేదు. తాగుడు మానిపించేందుకు కౌన్సిలింగ్ లు నిర్వహిస్తూ..మందులు ఇవ్వసాగారు. దాంతో తండాలో సారా వ్యాపారం చేసే లింగానాయక్.. రాజు నాయక్ లకు వీళ్ళను ఎలా ఎదుర్కోవాలో తెలియలేదు. అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఉపాయాలు పన్నారు.
            ఆ రోజు లింగానాయక్ కు పూనకం వచ్చింది. తండాను నాశనం చేయడానికి ఎక్కడెక్కడివాళ్ళనో  కేస్లా చేరదీస్తున్నాడని వాళ్ళంతా మంత్రాలు నేర్చుకుని చేతబళ్ళు చేస్తున్నారని..కేస్లాను అతని మిత్రులను ఊరినుండి తరిమి కొట్టాలని అమ్మతల్లి చెప్పింది. తండావారంతా అమ్మతల్లికి కల్లుతాపి శాంతింపజేసారు. కేస్లా తీవ్రంగా ఎదురుతిరిగాడు. తన మిత్రులకు ఏ మంత్రాలు రావని, ఇపుడిపుడే దారిన పడుతున్న మనవారిని బాగుపడనిద్దామని నచ్చజెప్పాడు. ఊరువారు మెత్తబడ్డారు. అంతే... ఆకస్మాత్తుగా  పచ్చని చెట్టు ఎండిపోయింది. రాత్రికి రాత్రే కొన్ని పశువులు చనిపోయాయి. కొందరికి పూనకాలొచ్చాయి. ఊరంతా ఏకమై అమ్మతల్లికి మళ్ళీ కోపం వచ్చిందని. కేస్లా అతని మిత్రులు ఊరొదిలి పోవాలని మరోమారు తీర్మానించారు. మిత్రులంతా తీవ్రమైన వేదనతో వెనుదిరిగారు.
        కానీ, నా ప్రాణం పోయినా తండా వదలి పోనన్నాడు కేస్లా. దీరు అతనికి అండగా నిలిచాడు.ఆ సాయంత్రం మరికొన్ని పశువులు అకస్మాత్తుగా చచ్చిపోయాయి. కొందరు వాంతులు చేసుకున్నారు. లింగాకు అతని అనుచరుడు భీముకు మళ్ళీ పూనకం వచ్చింది. .." కేస్లాను పంపెయ్యండి.. లేకపోతే తండాలో ఒక్కరూ మిగలరు.." అమ్మతల్లి అరిచింది. అందరూ చేరి కేస్లాను, దీరును తండా వదిలి వెళ్ళిపొమ్మన్నారు. మిత్రులిద్దరూ తండాను వదిలిపోయేదే లేదన్నారు. లింగా ఏమి చెప్పాడో జనం ఎందుకంత రెచ్చిపోయారో కేస్లాను పంపడానికి కాదు, ఏకంగా చంపెయ్యడానికే జనం సిద్ధమైపోయారు. ఆ అర్ధరాత్రి తండా జనం తరిమితరిమి కొడుతూ కేస్లాపై, పెట్రోల్ చల్లారు.. అడ్డు వచ్చిన దీరూనూ వదలలేదు." చంపండ్రా ఇద్దర్నీ చంపండి..." జనం వారి వెంట పరుగులు తీస్తూ అరుస్తున్నారు.
కేస్లా, దీరూ.. “వద్దూ..మమ్మల్ని చంపకండి.." దీనంగా అరుస్తూ ..చావుకేకలు పెడుతున్నారు..”కాసేపటికి దీరూ కేకలు ఆగిపోయాయి.
                                   *   *   *
         కేస్లా ఇప్పుడు మాల్యా ఇంట్లో..ఆమె వడిలో తలపెట్టి పొగిలిపొగిలి ఏడుస్తున్నాడు. ఏదుస్తున్నాడు."దీరులాల్ బతికి ఉంటే ఎంత బాగుండేదక్కా...కాల్చేసారు... మనవాళ్ళను మారచాలనుకున్నామేగానీ మంత్రాలు నేర్చి రాలేదు. అసలక్కడె పుట్టి పెరిగామే... అంత నిర్దాక్షిణ్యంగా ఎలా ప్రవర్తించగలుగుతారక్కా? " దీనంగా ఏడుస్తూ ప్రాధేయపడ్డా వినకుండా వెంటపడి మరీ పెట్రోల్ చల్లి మా ఇద్దర్నీ తగులబెట్టారు. నా కళ్ళముందే వాడు చావుకేకలు పెడుతూ కాలిపోయాడు. వాడిమీద పడ్డంత పెట్రోల్ నామీద పడలేదేమో. కాలుతున్న బట్టలతో..గాయాలతో నేను అడవిలోకి పరుగులు పెట్టి పారిపోయాను. ఆ పొగలో నేను పారిపోయిన సంగతి కూడా గమనించలేదు వాళ్ళు. లేకుంటే మళ్ళీ వచ్చి పూర్తిగా తగులబెట్టేవారేమో. ఎవరో రక్షించి లారీలో చాలాదూరం తీసుకెళ్ళి దవాఖానాలో చేర్పించారు. రెండు నెలలున్నానక్కడ. చచ్చిపోయినా బాగుండేదక్కా. నరకం చూసాను.
       ఆ గాయాల బాధ ఓర్వలేక ఎంత ఏడ్చేవాడినో.! ఎవరికోసం బతకాలి? నన్ను చంపెయ్యండంటూ వెర్రిగా ఏడ్చాను." వింటున్న కేస్లా స్నేహితులు కదలిపోయారు. మాల్యా చెంపలపై నీరు జారింది." త్వరలో నన్ను పంపేస్తున్నామని దవాఖానాలో చెప్పారు. త్వరగా వెళ్ళి అమ్మను నాన్నను  చూడాలని కోరిక. సువాలిని చూడాలన్న ఆత్రం. రెండు నెలల తర్వాత దవాఖానా నుండి బయటకు వచ్చిన నన్ను చూసి అందరూ దడుచుకుని తొలగిపోతున్నారు. జనమెందుకలా పారిపోతున్నారో తెలియలేదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఎటు వెళ్ళాలో దారి తెలియదు. భాష తెలియని మనుష్యుల మధ్య ఇబ్బంది పడడం కాదు. మాట్లాడటానికి అసలు నా మాటే అర్థం కాని గందరగోళం. ఒక ప్రక్క కాలిపోయిన చెంపతో నీరు త్రాగడానికి తిండి తినడానికి విపరీతంగా అవస్థపడేవాడిని. తినడానికి తిండిలేక, ఆకలి తీరక వెర్రికేకలు వేసేవాఆదీణీ... అన్నం పెట్టి ఆదరించడానికి ఎవరున్నారు నాకిక? కొన్నాళ్ళకు ఈ పస్తులు అలవాటైనాయిగాని కానీ, ఎక్కడ, ఎలా ఉండడం? తిరిగి తిరిగి ఊరి చివరకు చేరాను. అడివిని ఆశ్రయించాను. ఎండా వాన ఏమున్నా అదే నా నివాసం. "
        ఓ రోజు వాగులో ముఖం కడుక్కుంటున్న నాకు నీళ్ళల్లో ఓ వికృత రూపం కనిపించింది. అది నేనే అని అర్థమయ్యాకా ..ఎందుకు జనం నన్ను చూసి దడుచుకుంటున్నారో అర్థమయ్యింది. గుండె వాగయ్యింది.ఇందుకు కారణమైన నా సొంత జనాన్ని నిలదీయాలని వెర్రి ఆవేశంతో మా తండాకి ప్రయాణమయ్యాను. ముఖానికి గుడ్డ కప్పుకుని బస్సెక్కాను. దారిలోనే తెలిసింది. మా అమ్మా నాయనలు ఊరు వదిలి పారిపోయారని. ఎక్కడకు వెళ్ళారో ఎవరికీ తెలియదని. ఇక నన్ను పెళ్ళాడకుంటే చచ్చిపోతానని తీజ్ పండుగ రోజు నన్ను అల్లుకుని ఏడ్చిన సువాలి. మగనితో ఇంకో బస్సులో కనపడ్డది. నేను ముఖం గప్పుకున్నాను. ఇగ జన్మలో ఎన్నడు ఆమె నన్ను చూడకూడదనుకుని కోరుకున్నాను. పని ఇస్తానికి కూడా నన్ను చూసి భయపడే మనుష్యుల మధ్య ఉండలేక ఏకాకిగా బతుకలేక నిశ్శబ్ధంగా మారిపోయాను. తిండి దొరకదు. ఎండొచ్చినా వానొచ్చినా నీడ దొరకదు. రోగమొచ్చినా దు;ఖమొచ్చినా తోడు దొరకదు. విరక్తి....విరక్తి.. అడవికి..జనానికి మధ్య బ్రతుకుతూ మరణానికీ మధ్య మౌనానికీ రోదనకీ మధ్య నేను..స్నానం..పానం మరిచి మురికిగా..మాటా మంతి మరిచి నిస్సహాయంగా ..ఆకలి దప్పులు మరిచి రాయిలాగా..గడ్డం జుట్టూ పెరిగి పిచ్చివానిలాగా ఇలా మారిపోయాను..
        " మాల్యాతో అతిప్రయాసతో జరిగింది చెపుతున్నాడు. కదిలిపోయిన అతని మిత్ర బృందం " ఒరే కేస్లా..." అంటూ వాటేసుకుని ఏడ్చారు...వారిని చూసి..వద్దు వద్దు. నావంక చూడకండి మీరు భరించలేరు నన్ను అసహ్యించుకుంటారు నన్ను. మీరు అసహ్యించుకుంటే నేను భరించలేను. ముఖంపై గుడ్డ కప్పుకుని రోదించసాగాడు. కేస్లా...ఓరే కేస్లా..మేము నీ ప్రాణ స్నేహితులమురా..నిన్ను సజీవదహనం చేసారనుకుని కుంగిపోయాం. ఇన్నాళ్ళకు నీవు బతికే ఉన్నావన్న వార్త అందించి మాల్యక్కనూ మమ్మల్నీ రప్పించింది ఎవరో తెలుసా..నీ ప్రాణం .నీ మరదలు సువాలినేరా..." చివ్వున తలెత్తి చూసిన కేస్లాకు లోపలి గుమ్మం దగ్గర కన్నీళ్ళతో నిలిచి ఉన్న సువాలి కనిపించింది." ముందు కేస్లా..సరిగ్గా తినగలిగి స్పష్టంగా మాట్లాడగలగడానికి అవసరమైన ప్లాస్టిక్ సర్జరీ అత్యవసరం. ఆ తరవాత ఆగిపోయిన చదువును కొనసాగించేలా చెయ్యాలి. ఆ తర్వాత ఏం చెయ్యాలన్నది ఆలోచించాలి. మిత్ర బృందమంతా తమలో తాము  చర్చించుకుంటున్నారు. చక్కగా క్షౌరం చేయించి, తనను ముట్టుకుని స్నానం చేయించి, అన్నం పెడుతున్న మాల్యను  చూసి...
"
అక్కా..! నన్ను చూస్తే అసహ్యంగా లేదా..?" అడిగాడు కేస్లా.
"
లేదు కేస్లా..అసహ్యించుకోవాల్సింది నిన్ను కాదు. నీ పరిస్థితికి కారణం అయిన మనుస్యులను. వికృతంగా మారిపోయిన మనుష్యతత్వాన్ని...."
                              *   *   *
          మిత్రులంతా కలిసి కేస్లాకు ప్లాస్టిక్ సర్జరీ చేయించారు. మూడునెలలు డాక్టర్లు కృషితో కేస్లా కొత్తరూపుతో ఆసుపత్రి నుండి బయటకు వచ్చాడు. ఇప్పుడతనికి మూడు దార్లు కనబడుతున్నాయి.
       ఆగిపోయిన చదువు కొనసాగించడానికి మిత్రులతో ధన్ బాద్ కి....
       పోరాటాలు చేస్తానికి తుపాకి పట్టుకుని మాల్యాతో...
       తనవారిని వెదుక్కుంటూ ..తన తండా వారి కోసం బతకడానికి కోక్యా తండాకి.
       ఎందుకో అతని అడుగులు తండా వైపే పడుతున్నాయి.
                             *   *   *

Friday, June 29, 2018

రెడపంగి కావేరి


 గతుకుల మట్టి రోడ్డుపయి నెమ్మదిగా ముందుకు సాగుతున్నది అర్చన శ్రీరాం దంపతుల బండి. మెలికలు మెలికలుగా మలుపులు తిరుగుతూ యెంత దూరం సాగినా వాళ్ళు చేరాల్సిన ఆ పల్లె రాలేదు. అందరు ఉద్యోగులలాగే బడి పంతుల ఉద్యోగుల జీవితాల్లో బదిలీలు చాలా సాధారణం. కానీ కొత్త బడిలో చేరుతున్న ప్రతిసారీ కొత్తగా బడిలో చేరుతున్న చిన్నపిల్లల్లె మనసు బెరుకుగా ఉంటుంది అర్చనకు. అందుకే తొలి రోజు కాబట్టి ఆమె భర్త శ్రీ రామ్ కూడా తోడూ వచ్చాడు.
     "మీ బడి టీచర్ల కోసమే వెలిసాయా ఈ తండాలు ఇంత మారుమూల." రోజూ తన భార్య ఇంత  దూరం రావలసి ఉంటుందే అని బాధ పడ్డాడు అర్చన భర్త. "అలా అనుకుంటే ఎలా అండి మొదటి రోజు కదా చాల దూరం అనిపిస్తుంది. నాలుగు రోజులు అలవాటయ్యాక ఇంత  దూరం అనిపించదు." అని అన్నది. మరో రెండు పల్లెలు దాటాక  ఒక తండా వచ్చింది.. ఊరి మొదట్లో చిన్నగడ్డి మోపు పట్టుకుని నడచి వెళ్తున్నది ఓ  పన్నెండేళ్ళ  అమ్మాయి.
 "  గణేష్ తండా ఇదేనా పాపా ! ?" అని అడిగారు ఆర్చన  దంపతులు .    
 "నువ్వు కొత్త గొచ్చిన టీచర్వా .." ఆ అమ్మాయి అది గణేష్ తండానో కాదో చెప్పకుండా ఉత్సహంగా అడిగింది .. 
"అవును ." అన్నది .. అర్చన
"ఇదే గణేష్ తండా."కళ్ళు  చక్రాల్ల తిప్పుతూ అన్నది.
 "ఆరో తరగతికి కూడా వస్తవా టీచర్..? నువ్వు ఇంగ్లీష్ చెప్తావే .." వెంట వెంటనే  అని అడిగింది ..
"చెప్తాను కాని ముందు బడి ఎక్కడుందో చెప్పు .." 
"ఇంకా కొంచెం ముందుకు బోతే బోరింగ్ కాడ ఒక గేటు కనవడ్తది అదే బడి .."
" ఇంతకీ నీ పేరేమిటమ్మా .?"
"రెడపంగి కావేరి.."మెరుస్తున్న కళ్ళతో ఒకింత దర్పంగా ఇంటి పేరుతో సహా తన పేరు చెప్పింది. అంతలోనే కాస్త బెరుకుగా 
"టీచర్ నేను ఆరోది చదువుతున్నా.. మా అమ్మమ్మకి జరం. ఆవుదూడకు గడ్డి కోసం పోయిన రేపటి నుండి బడికొస్తా.. టీచర్"  అన్నది.
" సరేలే .." నవ్వుకుంటూ ముందుకు సాగిపోయారు శ్రీ రామ్ దంపతులు. "కొత్త టీచరొచ్చింది.. కొత్త టీచరొచ్చింది.." అరచుకుంటూ ఊర్లోకి సాగిపోయింది కావేరి
     చాల వెనుక బడిన ప్రాంతం అది. అరకొరా సౌకార్యలతో పాత బడిన గోడలతో ఉన్న బడి అది. జాయినింగ్ రిపోర్ట్ రాసిచ్చి ఆ బడిలో తొలి సంతకం చేసింది. "మొత్తం ఎనిమిది మంది సార్లు నేను ఒక్కతినే ఇక్కడ పంతులమ్మను హమ్మయ్య నాకు తోడుగా మీరు వచ్చారు.  చాల సంతోషంగా ఉంది అన్నది శారదా టీచర్"  ఇతర టీచర్లతోనూ పరిచయలయ్యాయి. ఆఫీస్ బయటకు వచ్చి కొత్త టీచర్ వచ్చిందని గుంపుగా తనని చుట్టుముట్టిన బడి పిల్లను చూస్తూ వారితో మాటల్లో పడింది. ఇక్కడ తానూ చేయవలసినది ఎంతో ఉన్నది అనుకున్నది. సాయంత్రం వరకూ ఉండి బెల్ అయ్యాక భర్తతో తిరుగు ప్రయాణమయ్యింది. 
    దారిలో "టీచర్.." అన్న పిలుపు వినపడి వెనక్కు చూసింది. ఇందాకటి కావేరి.. చేతులు వెనక్కు పెట్టుకుని బండికి అడ్డంగా నిలబడింది. అప్రయత్నంగా అర్చన బండి దిగింది. చేయి సాచి కావేరి ఓ కలువ పూవును అందించింది. అప్పుడు గమనించింది. కావేరి బట్టలు తడచి ఉండడాన్ని. అపురూపంగా ఆ కలువ పువ్వును అందుకుని.. "పిచ్చి పిల్ల నాకోసం చెరువులో దిగావా బాగా తడిచిపోయావు. త్వరగా ఇంటికెళ్ళి బట్టలు మార్చుకో" అంటూ.. కావేరి తల నిమిరి "రేపు తప్పకుండా బడికి రా.."  అని చెప్పి బండి ఎక్కింది. చల్లగాలి రివ్వున తాకుతుంటే ఆ అమ్మాయికి టా టా చెపుతూ ముందుకు సాగిపోయింది అర్చన.. వెనుకనుండి "టీచర్ నువ్వు అచ్చం మా అమ్మలా ఉన్నావు.." అన్న మాటలు చెవులకే కాదు మనసుకు తాకాయి.   
                                                   *  *  * 
  అనుకోకుండా అర్చనను ఆరోతరగతికి క్లాసు టీచర్ గా వేసారు. కావేరి బాగా చదివే అమ్మాయెమీ  కాదు కాని కాస్త అమాయకత్వం, ఒకింత గడుసుదనం. చురుకయిన కళ్ళు. ఎక్కడా ఆగకుండా తువ్వాయిలా పరుగు పెట్టె ఆ పిల్ల తుళ్ళింతలు.. అర్చనతో ఏదో అనుభంధం ఉన్నట్లుగా ఆ పిల్ల కనపరిచే ఆప్యాయత.. వీటన్నింటిని మించి ఆ పిల్లలో ఏదో తెలియని ప్రత్యేకత.. మరేదో ఆకర్షణ ఉన్నది. అదేమిటో అర్థం కావడం లేదు. కావేరితో మాట్లాడడం గురించి ఆలోచించడం నిత్య కృత్యాలయిపోయాయి ఆమెకు. కావేరిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ఇది మిద్దంగా ఇదీ అని చెప్పలేదు గాని ఆ ప్రత్యేకతకు అర్చన కట్టుబడి పోయింది. తనకు తెలియకుండానే కావేరి పట్ల అపేక్ష పెరిగి పోయింది. ఎలాగైనా ఆ పిల్లను దారిలో పెట్టి బాగా చదివించాలని అర్చన తాపత్రయపడసాగింది. కాని కావేరి తరుచూ బడి మానేస్తుంటుంది. దానికి ఏవేవో కారణాలు చెబుతుంటుంది.  
      రోజూ ఖమ్మం నుండి ఆ బడి ఉన్న తండాకు చేరుకోవడానికి అర్చన నాలుగు వాహనాలు మారి రావాల్సి వస్తున్నది. అదృష్టవశాత్తు సాయంత్రం మాత్రం డైరెక్ట్ బస్ ఉన్నది. అదీ బడి దగ్గరకే వస్తుంది. సాయంత్రం బడి ముగిసి పిల్లంతా బడి ఆవరణలోనే ఆడుకుంటూ ఉంటారు.  కొందరు బస్ వచ్చేవరకు అర్చన, శారదల చుట్టూ చేరి ముచ్చట్లు పెడుతుంటారు. ఎప్పటి లగే బడి వదిలాక పిల్లలంతా ఇళ్లకు వెళ్లిపోయారు. అర్చన శారదా బస్ కోసం ఎదురుచూస్తుండగా చుట్టూ చేరి పిల్లలు కబుర్లు చెప్పసాగారు. కావేరి ఆర్చన చెంత చేరింది.  
"నేను రోజూ బడికి రానని నీకు నామీద కోపమేం.." అడిగింది కావేరి  
"రాదా మరి రోజు బడికి రాకుంటే చదువెలా వస్తుంది మరి.."
"నిజమే టీచర్ మా అమ్మమ్మ లేవట్లేదు నేను పనికిబోకుంటే పయిసలేట్ల వస్తాయి. ? నాకంటే బడిల అన్నంబెడ్తరు. మా అమ్మకి అన్నమెవ్వెరు పెడతారు. మందులేవ్వరు ఇస్తరు.. " తన బాధను నొక్కి పెడుతూ కాస్త  గడుసుదనం మేళవించి చెబుతున్నది.
"అదేమిటి ఆమెకి పిల్లలు లేరా .."
"మా అమ్మమ్మకు మా అమ్మా, మా భీమారావు మామయ్యే పిల్లలు. మా నర్సయ్య మామయ్య కూడా ఉండేటోడు మూడేల్లకింద యాక్సిడెంటయి చచ్చిపోయిండు. ఇగ మా భీమ్రావ్ మామయ్య ఇక్కడుండడు హైదరాబాద్ లో ఉంటాడు. అయ్యో నీకు తెలవదు గదూ..  మా అమ్మ ఈడ ఉండదు. మా అమ్మ మళ్ళీ పెళ్లి చేసుకున్నది కదా ఆమెకి ఇద్దరు పిల్లలు బోనగిరిలో ఉంటది.." కావేరి చాలా మాములుగా చెబుతున్నది. అర్చన మాత్రం ఒక్కసారిగా  ఉలిక్కిపడింది.         
    "మా ఇంకో నాన్న .. అదే అశోక్ నాన్న మంచోడే గాని మాటి మాటికి పంపడానికి  చాన దూరమాయె. పాపం వాళ్ళకు కూడా ఎల్లాలే కదా. అదీగాక చెల్లె చాలా చిన్నది. మా తమ్ముడు ఇంకా చిన్నోడు. అందుకే వాళ్ళు రావడం కష్టం. ఇగ మా రమేష్ నాన్నను అదే మా అస్సలు నాన్నను పయిసలు అడుగుతుంటా. ఒక్కోసారి బాగానే ఇస్తాడు. ఒక్కోసారి మా అమ్మమ్మ మీద మస్తు కొట్లాడి వెళ్తాడు. బాగ తాగుతాడు. అందరి మీద గొడవలు పెట్టుకుంటాడు. మూడు నాలుగు సార్లు జైలుకు కూడా ఎల్లిండు కూడా. అసలు ఆయనను చూస్తుంటేనే  భయమేస్తుంటుంది. అయన మంచిగుంటే మాకీ కష్టాలు ఎందుకుంటాయి..?  మా అమ్మ యెంత మంచిదో..! నీ తీరే ఉంటది టీచర్.. అంటే నీ అంత తెల్లగా కాదనుకో..  కానీ మా అమ్మ చాల అందంగా ఉంటది." అమ్మ గురించి చెబుతుంటే కావేరి కన్నుల్లో వింత మెరుపు.
 "ఎప్పుడు నా కోసమే మనాది పెట్టుకుంటది. అప్పుడప్పుడు వచ్చి వారం రోజులు ఉంటది.   వచ్చేటప్పుడు నాకోసం కొత్త బట్టలు, రిబ్బన్లు, గాజులు తెస్తది. మా తమ్ముడికి రాఖీ కడతా గదా. పైసలన్న ఇస్తది. లేకుంటే బట్టలన్న తెస్తది.."  కావేరి ఒక రకం యాసతో అన్ని కబుర్లు  చెబుతుంటే విస్తుబోయి వింటున్నది అర్చన. 
   ఆ చిన్నారి జీవితంలో చక చక మార్పులు జరిగిపోయి..  అమ్మ చుట్టం చూపుగా వస్తున్నది. అమ్మా నాన్న బ్రతికి ఉండి చెరో చోటా బ్రతుకుతుంటే.. అమ్మమ్మకు తోడయి బ్రతుకుతున్నది. ఇన్ని మార్పులను బాధ్యతలను చిన్ని గుండె ఎలా తట్టుకుంటున్నదో కదా అనిపించింది. 
      "మరి మా అమ్మమ్మ పెద్దది. మా మామయ్యలు రమ్మన్నా పోకుండా నా కోసం ఈడనే ఉంటున్నది. అమెకేమయిన అయితే నేనే కదా చూసుకోవాలి." ఆరిందాలా అన్నది కావేరి. గుండె బరువయిపోగా అర్చనకేమి మాట్లాడాలో తోచలేదు. అంతలో "బస్సొస్తున్నది టీచర్  .బస్సొస్తున్నది టీచర్.." పిల్లల అరుపులు వినబడి తెరుకున్నది.         
కావేరి ఇదిగి ఈ వందా తీసుకుని మీ అమ్మమ్మకి మందులు కొను. నువ్వు మాత్రం.. రేపు బడికి రావాలి సుమా !" అని చెప్పి బస్ ఎక్కిందే గాని దారంతా కావేరి గురించే ఆలోచన. ఏది చెబుతున్నా ఆ కళ్ళలో మెరుపు .. దాచుకుంటున్న ఓ చిరునవ్వు మిళితమవుతుంటాయి. ఈ పిల్ల దగ్గర ఏదో తెలియని శక్తి ఉంది. మళ్ళీ అనుకున్నది.      
                                    *  *  * 
  బడి పిల్లలు చదువులో కాస్త బాగానే ఉన్నారు. అర్చన వచ్చిన దగ్గర నుండి వాళ్ళ వ్యక్తిగత శుభ్రత మీద దృష్టి పెట్టింది. రోజూ శుభ్రంగా తల దువ్వుకుని రావడం, గోళ్ళు తీసుకోవడం ఆడపిల్లలు రిబ్బన్లు వేసుకు రావడం. అందరూ తరగతి గదులు, కాంపౌండ్ శుభ్ర పరచడం లాంటి విషయాల మీద  శ్రద్ధ పెట్టింది. వాళ్ళల్లో చాలా మంది  పిల్లలు చాలా పేద పిల్లలు అవ్వడంవల్ల బంధు మిత్రుల దగ్గరనుండి పాత దుస్తులు సేకరించి తెచ్చి అవసరమున్న వాళ్ళకు  పంచింది. సూది దారాలు ఇచ్చి అందరికీ గుండీలు కుట్టడం నెర్పింది. పెద్ద పిల్లలు చిన్న  పిల్లలకు సహాయపడేలా చేసింది. వచ్చిన  కొద్ది కాలంలోనే పిల్లలకు బాగా చేరిక అయిపొయింది. ఇక  కావేరికి రెండు జతల కొత్త బట్టలు స్కూల్ బ్యాగ్ కొనిపెట్టింది. అందరూ "ఎంటండి మీరు ఆ పిల్లను అంతలా చేర దీస్తున్నారు ఆ పిల్ల వట్టి గాలి తిరుగుళ్ళు తిరుగుతున్తుందండి, చదువూ లేదు చట్టుబండలు లేదు. చేలు పట్టుకు తిరుగుతుంది" అన్నారు. అర్చన పట్టించుకోలేదు.                                          *  *  * 
           ఆ రోజు బడికి చాలా ఆలస్యమయిపోయింది అని కంగారు పడుతూ హడావుడిగా ప్రార్థన సమయానికి బడిలోకి అడుగు పెట్టింది అర్చన 
        బారులు తీరిన పిల్లలతో రాయంచలు కొలువయిన కొలనులా ఉన్నది  ఆ ప్రాంగణం. పిల్లలంతా కలసి పాడుకునే ఉదయరాగం.. వందేమాతర గీతం ఎంతో ఆహ్లాదంగా వినపడుతున్నది. ఒక అమ్మాయి ముఖంమీద జుట్టు పడుతుంటే మధ్యలో ఉఫ్ న  ఊది పాడుతున్నది. సోనికి అప్పుడే చెంప దురద పెట్టి గోకుతూనే రాగం అందుకున్నది. రాజుకి చేతిలో సగం తిన్న లాలీ పాప్ గబుక్కున బుగ్గలో దాచుకుని పాడుతున్నాడు. ఒకడు ఆకాశంవంక చూసి పాడుతుంటే, ఒకడు పక్కవాడి లాగు గుండీలు ఊడి పోయిన సంగతి గమనించి నవ్వు దాచుకుంటూ పాడుతున్నాడు.  దేశభక్తంతా చిన్నా ముఖంలోనే ఉన్నదా అన్నట్లు చాలా దీక్షగా పాడుతున్నాడు. సుజలాం అనగానే నాలిక పయికి నిలిపేసి .. సుఫలాం అనగానే నోరు మూసేసి.. మలయజ శీతలాం అనగానే నోరంతా తెరుచుకుని ముఖాల్లో రకరకాల హావ భావాలు వ్యక్త పరుస్తూ పాడుతున్న ఆ  చిన్నారుల ప్రార్థన సమవేశం చూసి తీరాల్సిందే. ఇక వాళ్ళు నిలుచున్నా తీరు చూడాలి. ఆ కాస్సేపు స్థిమితంగా నిలుచోలేక ఊగుతూ పాడేవారోకరు..  తల గోకుతూ పక్క వాడి ముఖంలోకి చిలిపిగా చూస్తూ ఒకరు..  టీచర్ల వంక భయంగా చూస్తూ ఒకరు.. ఏదో ఆలోచిస్తూ ఒకరు..  పదాలను మింగేస్తూ, విరిచేస్తూ, సాగదీస్తూ..  ఎంత అమాయికంగా పాడుతుంటారో..! అదొక అందమయిన ప్రపంచం. ఇక ప్రతిజ్ఞ కోసం చేయి సాచి నిలబడి భారతదేశం నా మాతృభూమి అని చెబుతూ బలం సరిపోక మరో చేయి ఆసరా తీసుకునే వాడు ఒకడు.  చాచిన చేయితో ఎదుటివాడి బుజం పయి ఒక్క సారి గుచ్చేవాడు ఒకడు. గట్టిగా అరిచి  చెప్పేవాడు ఒకడు .. నీరసంగా తప్పదన్నట్లు పెదాలు కదిపే వాడు ఒకడు. ఊడిన  రిబ్బన్ కుచ్చు ముఖం  మీదకు జారుతుంటే సరి చేసుకుంటూ ఒకమ్మాయి.. తానూ తెచ్చుకున్న పుట్టినరోజు చాక్లెట్లు ఎప్పుడు పంచాలా అని తపన పడుతూ ఒకమ్మాయి..  జలుబు ముక్కును తుడుచుకుంటూ ఒకమ్మాయి.. రాత్రి పెట్టుకున్న గోరింటాకు చేయిని చూసుకుంటూ ఒకమ్మాయి.. ఇలా  ప్రార్థన అలా ముగుస్తుందో లేదో.. వరి చేను నుండి ఒక్కసారిగా పయికి ఎగిరిన కొంగల బారులా.. అలలు అలలుగా ..  తరగతి గదులకు వెళ్తుంటారు. ప్రతి రోజు తానూ అమితంగా ఇష్టపడే దృశ్య కావ్యం ముగియగానే అర్చన ఆరవ తరగతి వరుసలో కావేరి లేకపోవడం అర్చన గమనించింది. కాస్త ఆలస్యంగానయినా వస్తుందేమో అని అనుకున్నది సంతకం చేసి హాజరు రిజిస్టర్ తీసుకుని తరగతి లోకి అడుగు పెట్టింది. 
      రిజిస్టర్ పట్టుకుని తరగతిలోకి వెళ్ళగానే పిల్లంతా లేచి గూ.. డ్.. మా.. నింగ్ మే.. డం అంటూ రాగ యుక్తంగా చెప్పారు. తానూ గుడ్మానింగ్ చెప్పింది. ఆ వెంటనే గలగలా మాట్లాడసాగారు. "లక్ష్మా గిచ్చిండు టీచర్.." " సరిత రిబ్బన్లు ఏసుకురాలే టీచర్ "  "రేవతికి ఇవ్వాళా జరం వచ్చింది టీచర్." " మీనాక్షి పద్యం నేర్చుకోలేదు.." " హారిక నన్ను కొట్టింది టీచర్.." " సలీం ఇందాక పడ్డాడు టీచర్.."  ఇలా వాళ్ళ మాటలన్నీవింటూ వాళ్ల  ఆరోపణలకు విని సమాధనమిస్తూ  హాజరు తీసుకోవడం మొదలు పెట్టింది ..
 "బానోతు హరీష్.. " ఎస్ టీచర్.."
" ఇస్లావాత్ లక్ష్మా.." ఎస్ టీచర్.."
"లేళ్ళ నవీన్..""రాలేదు టీచర్ వాడికి జ్వరం వచ్చింది .."
"భూక్య రమేష్ ఎస్  టీచర్ .." ఇలా అబ్బయిల హాజర్ అయ్యింది ..
 "బానోతు మీనాక్షి.." ఎస్ టీచర్.."
 "పండగ సరిత .."  ఎస్ టీచర్.."
"పాముల సావిత్రి "  ఎస్ టీచర్.."
"జక్కుల హారిక.." ఎస్ టీచర్.."
"రెడపంగి కావేరి.. "
"రాలేదు  టీచర్ .. " "ఎందుకు రాలేదు రోజు చెబుతున్నా ఆ అమ్మాయికి భయం లేకుండా పోతున్నది .. కోపంగా అన్నది అర్చన 
"అది కాదు టీచర్ వాళ్ళ అమ్మా వాళ్ళ ఇంకో నాన్న వచ్చిండ్రు టీచర్ .." అందుకే రాలేదు..
"ఓహో కావేరి వాళ్ళ అమ్మ వచ్చిందన్న మాట ఎందుకో మనసుకు కాస్త సంతోషం కలిగింది. ఆ కుంకుండు గింజల కళ్ళలో ఎన్ని మెరుపులు మెరసి ఉంటాయో .." కావేరి మీద కోపం ఎగిరిపోయింది .. 
"టీచర్ వాళ్ళ అమ్మ మళ్ళీ పెళ్లి చేసుకున్నది కదా..! కావేరి వాళ్ళ అమ్మమ్మ దగ్గరే ఉంటుంది. కావేరి వాళ్ళ అమ్మ వాళ్ళింకో నాన్న బోనగిరి లో ఉంటారు.." మళ్ళీ చెప్పడం  మొదలు పెట్టాడు లక్ష్మా
  "టీచర్ కావేరి వాళ్ళ అమ్మమ్మకి వంట్లో బాగోలేదు అందుకే చూడనీకి వచ్చిండ్రు." పిల్లలు చెప్పడం మొదలు పెట్టారు. పల్లెలో ఈ విషయనికయినా దాపరికం అంటూ ఉండదు. అందరి విషయాలు అందరికీ తెలిసి పోతుంటాయి. వాటిని చాల మామాలుగా మాట్లాడుకుంటారు. అయితే చిన్న చిన్న పిల్లలు కూడా చాల పెద్ద విషయాలు కూడా అతి మాములుగా చెబుతుంటే మొదట్లో విస్తుబోయివినేది అర్చన. ఇప్పుడిప్పుడే వాళ్ళ మాటలకు అలవాటు పడుతూ ఏది మాట్లాడవచ్చో ఎలా మాట్లాడకూడదో చెబుతూంటుంది. అందరీని నిశ్శబ్దంగా కూర్చోబెట్టి  పాఠం మొదలు పెట్టింది. 
        లంచ్ అవర్లో .. కిటికీ లోనుండి ఎవరో తొంగి చూస్తున్నట్లు అనిపిస్తే చూసింది. అవే రెండు మెరుస్తున్న చేప పిల్లలు. చిరునవ్వుతున్న పెదాలు. సంతోషంతో చిన్నగా లయగా ఊగిపోతూ కావేరి ..బయటకు వెళ్ళింది అర్చన.
 "నా మీద కోపమొచ్చిందా టీచర్ .. మా అమ్మొచ్చింది.. రెండు రోజులయినంక బడికి  తప్పక వస్తా .."
"నా కోపంతో నీకేమి పని. కనీసం పాఠాలన్నీ పోతున్నాయి అన్న భయం లేదు నీకు. లెక్కలు వినకుంటే పరీక్షలో ఎమిరాస్తావు.." కోపం నటిస్తూ అన్నది అర్చన. ఎందుకో కావేరిని చూస్తె కోపం రాదమెకు. "చదువుతా  టీచర్. తప్పకుండా చదువుతా " "టీచర్ ఇప్పుడు .. నాకు సంక్రాంతి సెలవలనుకో టీచర్. అప్పుడు నేను రాకుంటే కోపం రాదుగా ..! అట్లనే అనుకో  టీచర్. మా అమ్మొచ్చింది కదా నాకిప్పుడే సంక్రాంతి పండగ.. దసరా పండగా .. ఇగ్గో అమ్మ మీకు ఇమ్మంది. ఎల్లుండి బడికి వస్తా కోపమొద్దు టీచర్ .." ఓ కనకాంబర మాల అర్చన చేతిలో పెట్టి తువ్వయిలా పరుగున వెళ్ళిపోయింది. మళ్ళీ ఎన్నాళ్ళకో తప్ప కనపడని అమ్మ కోసం పాలపిట్టల రివ్వున ఎగిరిపోయింది. అమ్మ వెళ్ళాక వంటరి పిచ్చుక అది. చాల చిన్నతనం లోనే రెక్కల బలం పుంజుకుంటున్న తెంపరి పిచ్చుక. "కావేరిని వాళ్ళ అమ్మ తీసుకెళ్ళి పొతే ఎంత బాగుండు. ఏం మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయిని ఇక్కడే వదిలి వెల్లాలా ..? ఎలా వెళ్ళింది ఆమె..?  అసలు ప్రాణమెలా వప్పింది ఆమెకి ?" అర్చనలో ఎన్నో ఆలోచనలు 
                                             *  *  * 

        బస్  ఒక్కో మలుపు తిరుగుతుంటే . చల్లని గాలి  రివ్వున ముఖాన తాకుతున్నది. ఏ వయిపు చూసినా చూసిన పచ్చందనాలు ఆరబోసి ఉన్నాయి. విరగ కాసిన పత్తి చేలు పచ్చని నేలపయి చుక్కల ముగ్గు పెట్టినట్లుగా ఉన్నది. మరో వయిపు పూతకు వచ్చిన  లేతాకు పచ్చని ఆకుల ములగ చెట్లు తెల్లని సన్నని మొగ్గలతో సన్నజాజులు తురుముకున్న కన్నెపిల్లల్లా ఉన్నాయి. కాస్త ముందుకు వెళితే బారులు తీరిన బొప్పాయి మొక్కలు, వర్షంలో గొడుగులు విప్పుకుని నుంచున్న బడి పిల్లల్లా ఉన్నాయి. దూరాన కొండల పాదాల చెంత పత్తి, మిరప , బెండ , రకరకాల పంటలు పచ్చబారి ఉన్నాయి. మలుపులు మలుపుల మట్టి రోడ్డు పయి మెలికలు మెలికలు తిరుగుతూ వెళుతున్న పల్లె వెలుగు బస్సు కిటికీ నుండి తల తిప్పకుండా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆలోచనలో పడింది .. 
     "కావేరి వాళ్ళ అమ్మ ఇక్కడ ఉండదట కదా.." కావేరి  గురించి మరింత తెలుసుకోవడానికి శారద టీచర్ ముందు కావేరి ప్రస్తావన తెచ్చింది 
   "అవును అర్చన గారు.. లాస్ట్ ఇయర్ నేనే వాళ్ళ క్లాస్  టీచర్ ని. ఇప్పుడు రిజిస్టర్ లో తల్లి పేరు కూడా తప్పని సరిగా రాయాలని రూల్ వచ్చింది కదా..! ఈ కావేరి తండ్రి పేరు రెడపంగి రమేష్. తల్లి మళ్ళీ పెళ్లి చేసుకుంది కాబట్టి ఆమె ఇంటి పేరు మళ్ళీ మారింది. ఆమె పేరు కృష్ణవేణి.. ప్రస్తుతము అద్డంకి కృష్ణవేణి. మరి రిజిస్టర్ లో ఏమి రాయాలా అని నాకు అనుమానం  వచ్చింది. కావేరి పుట్టినప్పుడు ఇంటి పేరు రెడపంగి కదా.! మధ్యలో వాళ్ళ అమ్మ ఇంటి పేరు మారిందని ఎవరికీ తెలుసు. మొదటిదే రాయండి అన్నారు మిగితా టీచర్లు.  ఏమో నాకు ఇంకా ఈ అనుమానం తీరలేదు.. "చెప్పింది శారద  
    అర్చనకు కావేరి ఇంటి పేరు చరిత్ర గురించి మాట్లాడాలని లేదు. కానీ ఓపికగా విన్నది. కావేరి అమ్మమ్మ పెద్ద వయసుది ఆమె కదా.  రేపొద్దున్న ఆమెకేమయిన అయితే కావేరిని ఎవరు చూసుకుంటారు. ఆమె ఆర్థిక పరిస్తితి అంతంత మాత్రమే. కావేరి వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్లి ఉండవచ్చు కదా.." ఎన్నో ప్రశ్నలు దూరాన చేలో ఓ చిన్న పిల్ల.  కావేరిలాగే అనిపించింది. వాళ్ళ అమ్మ వెళ్లిపోయి ఉంటుంది. అమ్మమ్మతో  పాటు పనికి వెళ్లి ఉంటుంది. భారంగా నిట్టూర్చింది. అర్చన దిగాల్సిన స్టేజ్ వచ్చేసింది .. 
     వీళ్ళను చూడగానే ఆటో వాడు ముఖం అటు వయిపుకు పెట్టుకుని నిల్చున్నాడు.. "అబ్బో ఆ తండాకు ఎవరు వస్తారు తిరిగి వచ్చేటప్పుడు ఖాళీగా రావాలి.. కుదరదమ్మా" లాంటి నిత్య స్తోత్రం చదివాడు. మా అయ్యగా మా తండ్రిగా  అన్న రీతిలో బతిమాలి అతను అనుకున్న సొమ్ము చెల్లిస్తానికి ఒప్పుకున్నాక  రావడానికి సిద్దమయ్యాడు. ఆటోలో ప్రయాణిస్తూ ఆ చేలో ఉన్నది  రెడపంగి కావేరి అవునో కాదో ఇవాలయినా బడికి వస్తుందో రాదో  అని ఆలోచిస్తూ బడి చేరుతుండగానే "టీచరొచ్చింది. టీచరొచ్చింది.. గుడ్ మార్నింగ్ టీచర్.."  అనుకుంటూ దుమ్ము రేపుతూ పిల్లలు ఎదురు వచ్చారు. అర్చనకు ఎంతో ఇష్టమయిన అ పలకరింపులకు మనసు ఎప్పటిలా మురిసిపోయింది. సమయానికి బడికి చేరినందుకు తేలిక పడిన మనసుతోనవ్వుతూ బడిలోకి అడుగు పెట్టింది అర్చన. 
      ప్రార్థన ముగిసి క్లాసుకి వెళ్ళాక ఎప్పటిలా హాజరు తీసుకోవడం మొదలు పెట్టింది.  కావేరి పేరు దాగరకు రాగానే "రెడపంగి కావేరి  రాలేదు టీచర్ "అని ఒకరికిద్దరు అరిచారు. భారంగా నిట్టూర్చి.. ఆలోచనలను పక్కన బెట్టి పాఠంలో పడింది. పిల్లలకు రాత పని ఇచ్చింది. కస్సేపయ్యాక పాముల సావిత్రి అర్చన పక్కన చేరి "అసల్కయితే టీచర్. రెడపంగి కావేరిని వాళ్ళమ్మ ఏనాడో రమ్మన్నది. ఈమెనే పోలేదు. మాలావు పొగరు పిల్ల" అన్నది.
 "నువ్వు ముందు పాఠం రాసి చూపించు సావిత్రి" ..కోపంగా అన్నది అర్చన. 
       
                                                  *  *  *
      ఆ మర్నాడు కావేరి వాళ్ళ అమ్మమ్మ బడికి వచ్చింది. ఆమె వెనుకే దాక్కుని తల బయటకు పెట్టి బెదురుగా చూస్తూ కావేరి .. 
    "ఏంటి రంగమ్మ కావేరి ఇట్లా మాటి మాటికి బడి మానేస్తే ఎట్లా..? వాళ్ళమ్మ దగరకో నాన్న దగ్గరకో పంపిస్తే కాస్త భయం ఉంటుంది కదా.! అది మాటి మాటికి బడి మానడం నువ్వు వచ్చి ఏవో కథలు చెప్పడం మాములయ్యి పోయింది.." కోప్పడ్డారు హెచ్చెం గారు.
  " లేదు సార్ నాకే పాణం మంచిగా లేకుండే ఇకనుండి మంచిగా పంపుతాను.." అని చెప్పి  అర్చన దగ్గరకు వచ్చింది.
  "వీళ్ళ నాయిన దగ్గరకు పంపడానికి వాడో తాగుబోతు.  పిల్ల ఎటూగాని వయసులో ఉన్నది అది గాక వాడు దొరల దగ్గర రౌడీ. అది తెలియక నా కూతుర్నిచ్చి చేసి నానా తిప్పలు బడ్డ.. ఇడాకులు అయినంక గూడా తాగొచ్చి లొల్లి లొల్లి జేస్తున్నాడు. ఇట్లా కాదని పెద్ద మను
ష్యులకు  జెప్పి ఆళ్ళను ఈళ్ళను బతిలాడి నా బిడ్డకు  మళ్ళీ పెళ్లి చేసిన బిడ్డా. అల్లుడు మంచోడే పెళ్లయిన కొత్తలో అప్పుడే చిన్న ఈ పిల్లనెందుకు పంపాలే అని పంపలేదు. ఇగ ఎంటంటనె రెండు కాన్పులాయే.. కావేరి గూడ ఎల్లి ఉన్నది. నా దగ్గర కొన్ని రోజులు వాళ్ళ దగ్గర కొన్ని రోజులు  రెండు మూడేళ్ళు అట్లాట్ల మంచిగానే ఉన్నది .ఇగ ఆ కాడి నుండి నా మీద  బెంగ బెట్టుకుని ఇగ ఆడికి బోను నీ కాడ నే ఉంటాను అన్నది ఏమి జేతును బిడ్డ.." చాల సేపు మాట్లాడి కావేరిని కూర్చో బెట్టి వెళ్లి పోయింది. 
                                              *  *  *
      ఆ రోజు సాయంత్రం బస్ కోసం ఎదురు చూస్తున్నది అర్చన. ఆకాశమంతా మబ్బులు పట్టి చీకట్లు కమ్ముకున్నాయి. ఎప్పటిలా బడి ఆవరణలో పిల్లలు ఫుట్ బాల్  ఆడుతున్నారు. మబ్బులు పట్టడంతో కొందరు పిల్లలు ముందుగానే వెళ్లిపోయారు. ఎవరు ఉన్న వెళ్ళినా కావేరి మాత్రం అర్చన వెళ్లాకే వెళ్తుంది ..
"అసలు నువ్వు మా ఊర్లోనే ఉండు టీచర్. ఈ పోవుడు వచ్చుడూ బాధ ఉండదు." నవ్వింది కావేరి
"ఇంట్లో నీలాంటి.. ఓ చెల్లి, అక్కా ఉన్నారమ్మా. ఆరోగ్యం బాగుండని అత్తగారు ఉన్నారు. డాక్టర్ కి అందుబాటులో ఉండాలి. ఆమె కోసమే ఈ పరుగులు.." చెప్పింది అర్చన 
    "మా అమ్మ వాళ్ళ అత్తగారు కూడా మా అమ్మతోనే ఉంటది టీచర్. మొదట్లో మా చెల్లె పుట్టినప్పుడు నేను చాల పనులు చేసేదాన్ని. మా నాయినమ్మ అదే అశోక్ నాన్న వాళ్ళ అమ్మ.. ఏ పని చెప్తే అ పని చేసేదాన్ని. అప్పుడు నన్ను మంచిగానే చూసుకున్నది. మా తమ్ముడు పుట్టినప్పుడు ఆమెకి కొద్దిగా భయం పట్టుకున్నది." కావేరి చదువు మనమే చదివించాలా..?" " ఆమె  పెండ్లి కూడా మనమే చెయ్యల్నా..?" అని అనుడు మొదలు బెట్టింది. ఇగ మా అమ్మతో గొడవలు మొదలయినయి. "కావేరికి నాయినా ఉన్నాడు కదా.. నా కొడుకు ఎన్నని చూస్తడు. ఆడికి బంపు "అనడం  మొదలు పెట్టింది. 
     "మా రెడపంగోళ్ళలో నాకు వచ్చే ఆస్తి పంచుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఒక చిన్న ఇల్లు నాలుగెకరాల పొలం ఉన్నది. కాని మా నాయిన ఇట్లనే తాగి అందరితో గొడవలు పెట్టుకుని అన్ని అమ్ముకుంటుంటే.. మా  రమేష్ నాన్న నాకు ఇగ ఏమి మిగల్చడని వాళ్ళ బాధ. మా అమ్మోళ్ళ అత్త గారికి నేను బోయి ఆడనే కూసుంటే ఆయనే చదివి పిస్తడని.. ఆయనే పెళ్లి జేస్తడని ఆమె మసులో పడింది  టీచర్. ఇగ మా పూట పూటకు మా అమ్మతో లడాయి పెట్టుకుంట మా  అమ్మను చెరలు బెడ్తున్నది. మా అశోక్ నాన్న మా అమ్మని ఏమి అనలేక నడుమ మా అమ్మనే తిడుతున్నాడు. ఇగ రోజూ ఆమె మా అమ్మ ఆడిబిడ్డలు మా అమ్మను తిట్టుడు .. మా అమ్మమ్మని, మా అస్సలు నాన్నను తిట్టుడు.. ఇదే పని. ఇగ మా అమ్మ ఏడ్చింది ఏడ్చినట్టే. నా ఎనక ఎన్నో గొడవలు.. నన్ను జూసి ఆపుడు.. మా అమ్మ వంటింట్లకెల్లి  వెళ్లి ఏడ్చుడు. నేను అన్నే చూస్తానే ఉన్న .." ఒక నిమిషం ఆలోచనగా ఆపింది కావేరి ..
   "ఎన్ని సంద్రాలున్నాయి ఈ చిన్ని గుండెలో.. ఎంతా మాములుగా  చెబుతున్నది తనకు వచ్చిన భాషలో.." అనుకున్న అర్చనకు మాత్రం గుండె పట్టేసినట్లవుతున్నది .. 
         " ఇగ ఒగ నాడయితే  మెల్లె మెల్లగా మొదలయి చాల పెద్ద గొడవయ్యింది. ఆమెకి తోడు మా అశోక్ నాన్న వాళ్ళ చెల్లెల్లు కూడా వాళ్ళ అమ్మదిక్కే మాట్లాడిండ్రు. ఏమన్నారో తెలుసా టీచర్.. అయినా అది రెడపంగోళ్ళ పిల్ల.. ఆ పిల్ల మా వోని ర క్తం కాదు. ఇప్పుడు వానికే ఇద్దరు పిల్లలు. ఈ పిల్ల జర పెద్దగయ్యింది కదా..  మీ అమ్మ కాడికి బంపు.. అప్పుడు ఈ పిల్ల తల్లి దగ్గర లేదు అని వాళ్ళ నాయిననే బాధ్యత తెలుసుకుని ఆస్తి రాసిస్తాడు." అని అన్నది. ఇగ మా అమ్మ అందుకున్నది టీచర్.
       "అవును అది రెడపంగోల్ల పిల్లనే.. నన్ను ఆయన పెళ్లి జేసుకున్నప్పుడు తెలియదా. నాకు బిడ్డ ఉన్నదని..? అది కూడ నా కాడనే ఉంటదని.. దాన్ని ఆడికి ఈడికి బంపి దాన్ని దిక్కులేని దాన్ని చెయ్యను. కన్న తల్లిని నేను ఇంకా బతికే ఉన్నా. నా బిడ్డకు నేను ఇంత తిండి పెట్టి పెంచలేనా. సచ్చినా ఆ తాగుబోతు దగ్గరకు నా పిల్లను పంపను. ఇదిగో అత్తమ్మా  నాతో గొడవ పెట్టుకుంటే మంచి గుండదు.  ఈ కష్టాలు నాకు కొత్త కాదు. నువ్వు ఇట్లానే లొల్లి పెట్టుకుంటే నేను నా  ముగ్గురు పిల్లను తీసుకొని పోయి ఎక్కడయినా కూలి నాలి చేసుకునయిన బతికిన్చుకుంటా.." అని గట్టిగ చెప్పింది. ఆ రాత్రిల నన్ను దగ్గరకు తీసుకొని.."నేను మళ్ళీ  పెళ్లి చేసుకుని తప్పుజేసిన బిడ్డ.. నిన్ను వదలనే తల్లీ" అని మస్తు ఏడ్చింది. నేను కూడా మస్తు ఏడ్చిన.."కావేరి ఆగకుండా చెబుతుంటే అర్చన చెంపలు తడిచిపోతున్నాయి. 
      " దేవుడు పిలిసినట్టే ఆ రెండు రోజులకే మా అమ్మమ్మ వచ్చింది. మా అమ్మమ్మ వెళ్ళేటప్పుడు నేను కూడా వస్తా అని గొడవ చేసిన. అమ్మ నేను అమ్మమ్మ దగ్గర పది రోజులు ఉండి వస్తా.." అని చెప్పిన. సరే అని పంపింది మా అమ్మ అప్పుడు నేను అయిదోది చదువుతున్నా. ఈడ బడిల చేరిన. అంతే ఇగ మా అమ్మ ఎన్నిసార్లు పిలిచినా, ఎంత ఏడ్చినా నేను మళ్ళీ మా అమ్మ దగ్గరకు పోలే. మా అమ్మ మంచిగుంటే అంతే చాలు కదా టీచర్.. మొదలే మా రమేష్ నాన్నతో మస్తు తిప్పలు పడింది. ఇప్పుడు నా మూలంగా మల్లా బాధలు పడకూడదు. అందుకే ఎప్పుడన్నా ఎల్లినా నాలుగు రోజులుండి వచ్చేస్తా.. " 
     అసలు ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు. "అమ్మ ప్రశాంత జీవితానికి తానూ ఆటంకం కారాదని ఎంత బాధ్యత తీసుకున్నది ఈ చిన్న తల్లి. ఎవరు నేర్పారు తనకు ఇంతటి ఔదార్యము..! " అర్చన మూగబోయింది. గల గలా మాట్లాడుతూ కావేరి గుండెలో భారం దింపుకున్నది. దుఃఖభారంతో అర్చన గుండె బరువెక్కిపోయింది. కావేరి అర్చనకు చేరువగా వచ్చి గొంతు బాగా తగ్గించి.. 
     "టీచర్ .. అప్పుడప్పుడు మా అమ్మకు బాగా జరం రావాలని.. మా అమ్మమ్మ దగ్గరకు వచ్చి పది రోజులు ఇక్కడే ఉండాలని దేవునికి దణ్ణం పెట్టుకుంటా.. పోనీ నాకే జరం రావలె.. మా అమ్మ రావలె.. అని దణ్ణం పెట్టుకుంటుంటా. అట్ల కోరుకోవడం తప్పే కదా..! కానీ ఏమి చెయ్యాలా మరి అప్పుడప్పుడన్నా మా అమ్మను చూడాలే కదా" అర్చన కళ్ళలోకి చూస్తూ అడిగింది. 
     ఆర్చన కావేరిని గట్టిగా గుండెలకు హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చేసింది. "ఇలా దగ్గరకు తీసుకోవడం తప్ప ఏమి చెయ్యగలనీ పిల్లకోసం.." అనుకున్న అర్చన మనసు మరింత భారమయ్యింది. మబ్బులు మరింతగా కమ్ముకున్నాయి.  చీకట్లు మరింతగా ఆవరించాయి.. 
దూరంగా బస్ వస్తున్నా హారన్ వినపడింది.. "చీకటి పడింది జాగ్రత్తగా ఇంటికి వెల్లు..!" తల్లీ అన్నది 
       "సరే టీచర్ .. నువ్వు కూడా జగ్రత్తగా వెల్లు టీచర్ " నవ్వింది కావేరి
       ఆ మసక చీకట్లో కుంకుడు గింజలంటి కావేరి కళ్ళు మరింతగా మెరుస్తున్నాయి. అప్పుడే ఒక మెరపు మెరిసింది. ఆ మెరుపులో కావేరి కళ్ళు మరింత మెరిసాయి.
     అర్చనకు "ఈ పిల్లలో ఏదో ప్రత్యేకత ఉందీ అదేమిటో అర్ధం కావడం లేదు.." అనుకున్న ప్రశ్నకు బదులు దొరికింది. అవును కావేరి కళ్ళు మెరిసాయి.. కన్నీటి కొలనులోని చేపల్లా మెరిసాయి. ఆ కన్నీటిని చెంపలకు పాకకుండా అక్కడే నిలిపి.. ఆ పెదవులనుండి చిరునవ్వు జారి పోకుండా అక్కడే ఒడిసి పట్టిన విద్యేదో చాలా చిన్న నాడే నేర్చేసుకున్నది.. అదే కావేరి ప్రత్యేకత.. 

-
సమ్మెట ఉమాదేవి